గత తొమ్మిది నెలలుగా దేశంలో అన్ని ప్రాంతాలను భయంకరంగా వణికిస్తున్న మాయదారి కరోనా వైరస్ శబరిమల అయ్యప్పస్వామి ఆలయ ఆదాయానికి భారీగా గండి కొట్టింది. అయితే దీనికి గల ప్రధాన కారణం.. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడమే. ఈ ఏడాది తొలి మండలపూజ సీజన్ 39 రోజుల్లో రూ.9.09 కోట్ల ఆదాయం వచ్చినట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి రూ.156.60 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపారు. అంటే గత ఏడాదితో పోల్చితే స్వామి వారి ఆదాయం రూ.147 కోట్ల మేర తగ్గింది. అలాగే 39 రోజుల్లో కేవలం 71,706 మంది భక్తులు మాత్రమే అయ్యప్పను దర్శించుకున్నట్టు టీడీబీ ప్రెసిడెంట్ ఎన్ వాసు తెలిపారు. ఇక గత ఏడాదితో పోల్చితే భక్తుల దర్శనం కూడా గణనీయంగా పడిపోయింది.. మైనస్ ఐదు శాతం కంటే తక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చారు అని తెలిపారు. శబరిమల సందర్శించే భక్తుల సంఖ్యకు సంబంధించి హైకోర్టు, ప్రభుత్వం చేసిన సిఫారసులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.






మండల- మకరవిళక్కు పండగ ఏర్పాట్లు పూర్తయినట్టు వివరించారు. మండల పూజ సీజన్ మొదలైన తర్వాత డిసెంబరు 24 వరకు సన్నిధానం, పంపా, నిలక్కల్ వద్ద 390 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని టీడీబీ ప్రెసిడెంట్ తెలియజేశారు. వీరిలో 96 మంది భక్తులు కాగా, 289 మంది ఆలయం వద్ద విధులు నిర్వర్తిస్తున్న అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది ఉన్నట్టు వివరించారు. ఆలయ ఉద్యోగులకు సన్నిధానం వద్ద యాంటీజెన్ టెస్ట్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ నిర్ధారణ అయిన సిబ్బంది, వారితో కాంటాక్ట్ అయినవారిని సకాలంలో గుర్తించి సన్నిధానం విధుల నుంచి తొలగించి చికిత్సకు తరలిస్తున్నామని అన్నారు. సిబ్బంది వైరస్ బారినపడ్డా యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్-19 నిర్ధారణ అయిన సిబ్బంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలియజేశారు. కేవలం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకున్న భక్తులను శబరిమలలోకి డిసెంబరు 26 నుంచి అనుమతించాలని కేరళ హైకోర్టు, ప్రభుత్వం టీడీబీకి సూచించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: