కరోనా వల్ల మరణించిన వారి దుస్దితి చాలా దారుణంగా ఉందట. ముఖ్యంగా ప్రభుత్వం పేదల ఆస్పత్రిగా చెప్పుకొనే వరంగల్‌ ఎంజీఎంలో అయితే సరైన చికిత్స అందకపోవడమే కాదు, ఆరోగ్యం విషమించి మృత్యువుపాలయినా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి నెలకొంది. అందులో కరోనాతో మరణించిన వారిని తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు ముందుకు రాక.. మార్చురీలో చోటు లేకపోవడం, ప్రిజర్వేషన్‌కు సంబంధించిన సమస్యలతో మృతదేహాలను గంటలకొద్దీ వార్డుల్లో పడకలపైనే ఉంచేస్తున్నారట.


ఈ ఆస్పత్రిలో.. శ్వాస సంబంధ సమస్యలతో వచ్చే రోగులను ఉంచే వార్డు  కిక్కిరిసిపోయింది. కొవిడ్‌ వార్డులో ఇప్పటికే సామర్థ్యానికి మించి కరోనా బాధితులు ఉన్నారు. అందులో కొందరు రోగులకు కేస్‌ షీట్లు లేకుండానే చికిత్స అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక పసిపిల్ల వార్డులను, కరోనా వార్డులను దూరం దూరంగా ఏర్పాటు చేయాలి కానీ నవజాత శిశువుల వార్డు పక్కనే, కోవిడ్ వార్డ్ ఏర్పాటు చేశారు.  దీనివల్ల నవజాత శిశువులకు కరోనా సోకే ముప్పు అధికమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇక్కడ తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల రోగులు ఎన్నొ కష్టాలు పడవలసి వస్తుంది. వాస్తవానికి ఎంజీఎం వైద్యులు చాలా మంది కరోనా బాధితులుగా మారారు. దీంతో వారంతా క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. దీనివల్ల.. రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన డాక్టర్లు అందుబాటులో లేకుండా పోయారు. దీని వల్ల రోగులకు వైద్యం పూర్తిస్థాయిలో అందట్లేదు. అదీగాక వర్షం వస్తే పెద్ద ఎత్తున నీరు ఆస్పత్రి వార్డుల్లోకి చేరుకుంటుంది.. అలా వచ్చే నీటి వల్ల అంటు రోగాలు వస్తాయేమో అన్న భయం రోగులను వెంటాడుతోంది.


మరోవైపు.. తమకు కనీస రక్షణ పరికరాలు, సౌకర్యాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా పని చేయాలని ఆస్పత్రిలోని ల్యాబ్‌టెక్నీషియన్లు వాపోతున్నారు. 12 గంటల చొప్పున డ్యూటీలు నిర్వహించినా.. తిరిగి విధులు నిర్వహించాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా ఒకటేమిటి ఈ ఆస్పత్రిలో ప్రభుత్వ వైపల్యం క్షుణంగా కనిపిస్తుంది.. అధికారుల మాటలు చేతలవరకు వెళ్లకపోవడం ఇలాంటి పరిస్దితుల్లో దురదృష్టకరం.


మరింత సమాచారం తెలుసుకోండి: