
ఎన్నో పార్టీలకు, నేతలకు రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ అడుగు పెడితే విజయం వరిస్తుందని నమ్ముతుంటారు. ఇప్పటి వరకు చేపట్టిన బాధ్యతలను పీకే పూర్తి చేసి వ్యూహకర్తగా సక్సెస్ తన వెనుక ఉంచుకున్నారు. అయితే, ఈసారి సీఎం కేసీఆర్ పీకే సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే ఎన్నికల పోరును మొదలు పెట్టిన కేసీఆర్.. ఫెడరల్ ఫ్రెంట్ స్థాపించేందుకు పీకే ను రంగంలోకి తీసుకోవాలనుకుంటున్నారట. అయితే, ఎవరి ఎన్ని వ్యూహాలు రచించాలని చూసినా కేసీఆర్‌కు తన సొంత స్ట్రాటజీలు ఉంటాయి.
కానీ, అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంతో పీకేను కేసీఆర్ రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. గతంలో బీజేపీ, కాంగ్రెస్ ఏతర పార్టీలతో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నించారు. కానీ, అది సఫలం కాలేదు. దీంతో ఇప్పుడు మరోసారి థర్డ్ ఫ్రంట్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు పీకేను భాగం చేయాలనుకుంటున్నారట. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఫిబ్రవరి నుంచి పీకే టీమ్‌ను రంగంలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు పీకేకు అప్పగిస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గులాబీ నేతలు జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.