దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు కూడా ఎన్నికలపైనే దృష్టి సారించాయి. ప్రధానంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు కారణం... యూపీలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ స్థాయి రాజకీయాలను శాసిస్తుందని అన్ని పార్టీల నమ్మకం. అందుకోసమే యూపీలో గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తున్నాయి. అదే సమయంలో ప్రధానంగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ఎన్నికపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు వరుసగా ఐదు సార్లు గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైన యోగీ ఆదిత్యానాథ్... తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతున్నారు. దీంతో యోగీని ఓడించేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కూడా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన సర్వే నివేదికల్లో యోగీ నాయకత్వానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు.

యోగీ ఆదిత్యానాథ్‌ను అయోధ్య నుంచి బరిలో నిలపలాని బీజేపీ అగ్రనాయకత్వం శాయశక్తులా ప్రయత్నం చేసింది. చివరికి ప్రధాని నరరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా స్వయంగా రంగంలోకి దిగారు. కానీ... యోగీ మాత్రం తనను ఎంతగానో ఆరాధిస్తున్న గోరఖ్ పూర్ సదర్ నియోజకవర్గం నుంచే పోటీలో నిలిచారు యోగీ. 1989 తర్వాత ఈ నియోజకవర్గం నుంచి కేవలం ఒక్కసారి మాత్రమే బీజేపీ ఓడిపోయింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాధా మోహన్ దాస్ అగర్వాల్‌ను తప్పించి యోగీ ఆదిత్యానాథ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో యోగీని ఓడించేందుకు ఇప్పుడు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్వయంగా బరిలోకి దిగనున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా యోగిపై తాను పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు చంద్రశేఖర్ ఆజాద్. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆజాద్‌కు కూడా ఇదే తొలిసారి. తాను గెలిచినా, గెలవకపోయినా ఫర్వాలేదని, యోగి మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనేది తన పంతం అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: