విశాఖ పట్నంలో సాధారణ పౌరుల కిడ్నీలతో యథేచ్చగా వ్యాపారం కొనసాగిస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు. ఒక్కో కిడ్నీకి దాదాపు రూ. 40 నుంచి 45 లక్షల వరకు తీసుకుని కిడ్నీల మార్పిడి చేస్తున్నారు. కిడ్నీ ఇచ్చిన బాధితులకు మాత్రం రూ.7 లక్షల నుంచి 8 లక్షలు ఇస్తామని చెప్పి వాటిని ఇవ్వడం లేదు. ఇచ్చే ఏడు, ఎనిమిది లక్షల్లో దళారులు సగం కంటే ఎక్కువ కొట్టేశారు.


వైజాగ్ లోని బాంబే కాలనీలో ఇలా కిడ్నీలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేటు హాస్పిటల్ ను అధికారులు మూసి వేయించారు.  ప్రైవేటు హాస్పిటల్స్ లో జరుగుతున్న కిడ్నీ రాకెట్ ముఠాను గుట్టు రట్టు చేయాల్సిన ప్రభుత్వం కేవలం ఆ హాస్పిటల్ ను మూయించి చేతులు దులుపుకుంది. ఇలాంటి కేసులపై సీఐడీ విచారణ వేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇది ఇక్కడితోనే ఆగిందా లేక ఇంకా ఏదైనా ప్రాంతాల్లో కొనసాగుతుందా.. అనేది విచారించాలని అడుగుతున్నారు.


ప్రభుత్వం దీని గురించి సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పోనీ ప్రతిపక్షాలు ఏమైనా పట్టించుకుంటున్నాయా అంటే చడీ చప్పుడు లేవు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి సంస్థలపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంటే, పోరాడాల్సిన సమయంలో ప్రతిపక్షాలు తమకెందుకులే అని ఈ అంశం గురించి తెలియనట్లే వ్యవహరిస్తున్నాయి.


గతంలో పల్నాడు ప్రాంతంలో ఇలాంటి కుంభకోణం జరిగింది. ఆ  సమయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. కిడ్నీ ఇవ్వాలన్న, దానికి కొన్ని రూల్స్ ను తీసుకొచ్చింది. ఆ రూల్స్ ప్రకారం.. బంధువులకు, దగ్గరి సంబంధీకులకు అనుమతితో ఇవ్వొచ్చని చెప్పింది. విశాఖ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఎలాంటి అనుమతులు లేవు. ప్లాన్ ప్రకారం.. అమాయకుల జీవితాలతో ఆడుకున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: