కొన్ని సంవత్సరాల క్రితం ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతున్న అల్లు అర్జున్ ను పవన్ అభిమానులు పవన్ గురించి మాట్లాడమంటే ‘చెప్పను బ్రదర్’ అంటూ చేసిన కామెంట్ వల్ల పవన్ అభిమానులకు అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. ఈ గ్యాప్ వల్ల ఎదో కారణం చూపెడుతూ పవన్ అభిమానులు అల్లు అర్జున్ ను అవకాశం చిక్కినప్పుడల్లా టార్గెట్ చేస్తూనే ఉన్నారు.ఇప్పుడు ఆ చెప్పను బ్రదర్ స్థానంలో ‘వద్దు బ్రదర్’ ట్యాగ్ లైన్ వచ్చి చేరింది. గత కొన్ని సంవత్సరాలుగా హిట్ అన్న పదాన్ని మర్చిపోయిన షారూఖ్ ఖాన్ కు ‘పఠాన్’ మూవీ ఇచ్చిన సూపర్ సక్సస్ కిక్ అతడిని మళ్ళీ బాలీవుడ్ బాదుషా గా మార్చింది. ఇప్పుడు ఈ సమ్మర్ రేస్ లో రాబోతున్న షారూఖ్ ‘జవాన్’ మూవీ పై మరింత అంచనాలు పెరిగాయి. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ గ్యారెంటీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ అప్పుడే ప్రచారం మొదలైపోయింది.ఈమూవీ పై పెరిగిపోయిన అత్యంత భారీ అంచనాల రీత్యా షారూఖ్ అట్లీ లు ఒక మాష్టర్ ప్లాన్ వేసారు. తమ సినిమాకు దక్షిణాదిలో కూడ భారీ కలక్షన్స్ వచ్చే విధంగా ఈమూవీలోని ఒక అతిధి పాత్రను తమిళ టాప్ హీరో విజయ్ తో నటింపచేయాలని ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాలకు విజయ్ నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు వారి దృష్టి అల్లు అర్జున్ పై పడింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలోని అతిధి పాత్రను చేయవలసిందిగా అట్లీ బన్నీని కోరినట్లు తెలుస్తోంది.


ఈవిషయమై అల్లు అర్జున్ అంగీకారం లభించిందా లేదా అన్న విషయమై ఇప్పటికి క్లారిటీ లేదు. అయితే ఈవార్త సోషల్ మీడియాకు లీక్ కాగానే కొందరు బన్నీ అభిమానులు ‘వద్దు బ్రదర్’ అంటూ ఒక ట్యాగ్ ను క్రియేట్ చేసి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన బన్నీకి షారూఖ్ పక్కన అతిధి పాత్ర ఎందుకు అంటూ సలహాలు ఇస్తున్నారు. వాస్తవానికి ఈ సలహా బన్నీ అభిమానులు నిజంగా ఇస్తున్నారా లేకుంటే ఎవరైనా ట్రోల్ చేయడానికి ఇలాంటి సలహాను ఇస్తున్నారా అన్న విషయమై క్లారిటీ లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి: