
కథ :
ఒక రాబరీ గ్యాంగ్ నగరంలో చేస్తున్న వరుస హత్యలు పోలీసులకు సవాలుగా మారతాయి. అదే సమయంలో ఐపీఎస్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్న విక్రాంత్(సాగర్) ఈ కేసుపై దృష్టి పెడతాడు. తాను ఎంతగానో ఇష్టపడిన ఆర్తి (మిషా నారంగ్) విషయంలో సైతం ఈ గ్యాంగ్ చేసిన తప్పు విక్రాంత్ ను ఎంతగానో బాధ పెడుతోంది. అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ ఎవరు? వాళ్ళను పట్టుకున్న విక్రాంత్ ఏ విధంగా బుద్ధి చెప్పాడు? అయితే ఆర్తికి ఆ గ్యాంగ్ కు నిజంగా లింక్ ఉందా లేదా? చివరకు ఏమైంది? ఈ కథలో విష్ణుప్రియ పోషించిన పాత్ర ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో భిన్నమైన టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొందుతుండగా ఈ సినిమాకు ‘THE 100’ పెట్టడం వెనుక కారణం తెలియాలంటే మాత్రం సినిమా తప్పకుండా చూడాల్సిందే. విక్రాంత్ పాత్రకు సాగర్ జీవం పోశారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రొటీన్ స్టోరీ లైన్ అయినప్పటికీ కథనం కొత్తదనంతో ఉండటంతో పాటు కథలో వచ్చే ట్విస్టులు ఈ సినిమా స్థాయిని పెంచేశాయి.
సాగర్ లుక్స్, ఆహార్యం విక్రాంత్ పాత్రకు సరిగ్గా సరిపోయాయి. మిషా నారంగ్ కు పరిమితంగా స్క్రీన్ స్పేస్ దక్కినా ఆమె తన పాత్రకు న్యాయం చేయడంతో పాటు తెరపై అందంగా కనిపించారు. తారక్ పొన్నప్ప, ధన్య బాలకృష్ణన్, లక్ష్మీ గోపాలస్వామి పాత్ర పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో సాగర్ ఖాతాలో సక్సెస్ చేరింది.
టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ కథనంతో మ్యాజిక్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో డైలాగ్స్ సైతం న్యాచురల్ గా ఉంటూనే ఆసక్తికరంగా ఉన్నాయి. అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో సమపాళ్లలో కుదిరాయి. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఈ క్రెడిట్ దర్శకుడికి దక్కుతుంది.
శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ, హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. ఫస్టాఫ్ లోని కొన్ని సీన్లు, ఎడిటింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది.
రేటింగ్ : 3.0/5.0