బీజేపీ విద్వేషపూరిత మత రాజకీయాల గురించి యువత ఆలోచించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారని ప్రశ్నించారు. శాంతిభద్రతలు కోరుకుందామా..?  అనేది యువత ఆలోచించుకోవాలనీ.. శాంతి లేని చోట పెట్టుబడులు ఎవరు పెడతారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పట్ల దారుణంగా మాట్లాడిన అసోం సీఎంను బీజేపీ ప్రోత్సహిస్తుందా.. అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికాలో ట్రంప్ తరఫున ప్రధాని మోడీ ప్రచారం చేశారనీ.. ఆయన ప్రచారం చేయడం ఏంటో తనకు తెలియలేదని సీఎం కేసీఆర్ అన్నారు. అమెరికా ఎన్నికలేమైనా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలా అని ప్రశ్నించిన కేసీఆర్.. మోడీ ప్రచారం చేయడం వ్యూహాత్మక తప్పిదమన్నారు. ఏ ప్రధాని అయినా విదేశీ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాదు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వినియోగదారులకు ఏడాది లోగా విద్యుత్ మీటర్లు పెట్టాలన్నారు. ప్రస్తుత మీటర్లను దశల వారీగా ప్రీపెయిడ్ మీటర్లుగా మార్చాలన్నారు. ఈ విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే అరశాతం ఎఫ్ఆర్ బిఎమ్ ఐదేళ్ల పాటు ఇస్తామన్నారు. దీనికి తెలంగాణ ఒప్పుకోలేదన్నారు. ఏపీ అంగీకరించడంతో శ్రీకాకుళంలో 25వేల వ్యవసాయ మీటర్లు ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రధాని మోడీ ఎక్కువగా అబద్దాలు చెబుతారని.. చెప్పేది ఒకటి, చేసేది ఒకటని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యుత్ సంస్కరణలపైనా మోడీ అబద్దాలే చెప్పారన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలని ముసాయిదా బిల్లులో ప్రస్తావించినట్టు గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ బిల్లను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నష్టపోయినా సరే ఈ విద్యుత్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. చూద్దాం.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి: