
పల్లెల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి అని అందరూ భావిస్తారు. కానీ నిజానికి పండుగ వెనుక ఉన్న ప్రాముఖ్యత చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సంక్రాంతి పెద్ద పండుగ అని ఎందుకు అంటారు అసలు దీని వెనుక ఉన్న ఇప్పుడు తెలుసుకుందాం.. సంక్రాంతి అంటే తెలుగు ప్రజల పెద్ద పండుగ కోస్తాంధ్ర, రాయలసీమలో పండుగ కల కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రంగురంగుల రంగవల్లులు కొత్తబట్టలు, భోగి పళ్ళు, గొబ్బెమ్మలు, కోడిపందాలు, హరిదాసులు ఇలా పల్లెటూర్లకు సంక్రాంతి పెద్ద శోభ తీసుకువస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు.. భోగి పండుగ తో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. భోగి రోజు వేకువ జామునే భోగి మంటలు వేసి ఆ మంటల్లో పాత వస్తువుల్ని వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. దీని వల్ల కీడు అంత తొలగిపోయి మంచి రోజులు రావాలని అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో భోగిమంటలు వేస్తారు.
అదే రోజు బొమ్మల పేరంటాలను ఏర్పాటు చేసుకుంటారు. ముత్తైదువులను పిలిచి పేరంటం చేసి పండు తాంబూలం అందజేస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి భోగిపళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే రేగు పళ్ళు, పూలరేకులు, చిల్లర నాణేలు, చెరుకు ముక్కలు కలిపి పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు. అయితే, ఈ రేగిపళ్లను పిల్లల తల మీద పెట్టడం వల్ల ఆ శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అలాగే పిల్లలపై ఏదైనా చెడు దృష్టి ఉంటే తొలగిపోతుందని కూడా ఒక నమ్మకం. తల పై భాగంలో బ్రహ్మ రంధ్రం ఉంటుంది దాని మీదుగా పిల్లల జ్ఞానం పెరుగుతుందని మరికొందరికి నమ్మకం. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారే సమయంను సంక్రమణం అని పిలుస్తారు.
ఏడాదిలో 12 రాశుల్లో సంచరిస్తాడు.. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోకి అడుగుపెట్టే సమయానికి ఒక ప్రత్యేకత ఉంది. అప్పటివరకు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తర దిక్కుగా సంచరిస్తాడు. అందుకనే దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుచుకుంటారు. ఇలా సూర్యుని గమనం మారడం వల్ల ఇప్పటి వరకు ఉన్న వాతావరణం కూడా పూర్తిగా మారిపోతుంది. సంక్రాంతి నీ సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఈ పండుగ తేదీ పెద్దగా మారదు. అయితే సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణం.. మకర సంక్రాంతి గా పిలుస్తారు. ఆ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
సంక్రాంతి నాడు కొత్తబియ్యంతో పిండివంటలు చేసుకోవడంలో అర్థం పరమార్థం రెండు ఉంటాయి. సంక్రాంతి నాటికి పొలాల నుండి వచ్చిన కొత్త బియ్యంతో ఎవరు అన్నం వండరు. అప్పుడే పండించిన బియ్యంతో వండిన అన్నం తింటే అజీర్ణం చేస్తుంది. అందుకే వాటిని నానబెట్టి పిండి ఆడించి బెల్లం పాకం పట్టి అరిసెలు చేస్తారు. అలాగే పాలు పొంగించి కొత్త బియ్యంతో పరమాన్నం కూడా వండుకుంటారు. ఇలా కొత్తబియ్యంతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల అజీర్ణం కూడా చేయదు. అలాగే కొత్త బియ్యంతో వండిన పిండివంటల్లో భగవంతుడికి నైవేద్యం సమర్పించడం వల్ల సక్రమంగా చేతికి అందిన అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఈ మూడు రోజుల పాటు జరిగే పండుగలో పెద్దలు, చిన్నలు కలిసి ఆడిపాడుతూ ఆనందంగా ఉంటారు.