దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న క‌రోనా క‌ల‌క‌లం ప్ర‌జ‌లను ఎంత‌టి క‌ల‌వ‌రానికి గురి చేసిందో....రాజస్థాన్ కాంగ్రెస్‌లో నెల రోజులుగా నెలకొన్న సంక్షోభం ఆ పార్టీ పెద్ద‌ల‌కు సైతం అదే రీతిలో ఆందోళ‌న క‌లిగించింది. రెబల్ ఎమ్మెల్యేలతో కలసి నిర‌స‌న తెలిపిన  మాజీ డిప్యూటీ స్పీకర్ సచిన్ పైలట్ పార్టీ అధినాయకత్వాన్ని కలసిన త‌ర్వాత త‌న డిమాండ్ల‌ను ఆమోదించుకున్న అనంత‌రం శాంతించారు. అయితే, ఈ విష‌యంలో ఊహించ‌ని కామెంట్ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. అదే ఆప‌రేష‌న్ లోట‌స్‌.దానికి కౌంట‌ర్‌గా నిర్వ‌హించిన కాంగ్రెస్ ఆప‌రేష‌న్‌.


రాజ‌స్థాన్ ప‌రిణామాల‌ను విశ్లేషిస్తూ, మ‌హారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన పార్టీ యొక్క అధికార ప‌త్రిక అయిన `సామ్నా` తన ఎడిటోరియల్‌లో హాట్‌ కామెంట్లు చేసింది. ఆపరేషన్ లోటస్ ఫెయిల్ అయిందని బీజేపీపై మండిపడింది. రాజకీయ వికృత చేష్టలు ఓడిపోయాయ‌ని పేర్కొంటూ బీజేపీకి రాజ‌స్థాన్ సీఎం గెహ్లాట్ గుణపాఠం నేర్పారని విశ్లేషించింది. రాజస్థాన్‌లో తాజా విఫల యత్నంతో రాజకీయ అనైతిక చేష్టలకు పరాభవం ఎదురైంది. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి గెహ్లాట్ ప్రతి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నారు అంటూ ప్ర‌శంసించింది.


ఆపరేషన్ లోటస్‌, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆపరేషన్ నిర్వహించారని ప్రశంసించ‌డంతో పాటుగా త‌మ రాష్ట్రంలోని ప‌రిణామాల‌ను విశ్లేషించింది. ‘మహారాష్ట్రలో కూడా ఇలాంటి ఆపరేషన్ ఫెయిలైంది. ఇప్పటికైనా బీజేపీ గుణపాఠం నేర్చుకోవాలి. ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడంతో బీజేపీ బిజీగా ఉంది. ఇది రాజకీయ మానసిక అనారోగ్యానికి సూచన కాదా? షోలే ఫిల్మ్‌లో గబ్బర్‌‌ సింగ్‌లా ఆపరేషన్ లోటస్ అనే తీవ్రవాదాన్ని సృష్టించారు. `` అంటూ మండిప‌డింది. మహారాష్ట్రలో ఆపరేషన్‌కు కొత్త డేట్ సెప్టెంబర్ అని తెలుస్తోంది అంటూ సామ్నా మ‌హారాష్ట్ర స‌ర్కారు గురించి డౌట్లు రేకెత్తించింది. దేశంలో కరోనా ఇప్పట్లో త‌గ్గుముఖం ప‌ట్టే సూచనలు కనిపించడం లేదు. నిరుద్యోగం పెరుగుతోంది. ఎకానమీ కుంటుపడుతోంది. దాన్ని కాపాడే బదులు ఇతర ప్ర‌భుత్వాల‌ను పడగొట్టడానికి బీజేపీ ఎన్ని ప్ర‌యత్నాలు చేస్తుందో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు అంటూ విరుచుకుప‌డింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: