
ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట మెదడుకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య పరీక్షల్లో ప్రణబ్‌కు కరోనా సోకినట్లు వెల్లడైంది. ‘ప్రణబ్ గుండె పనితీరు, రక్తప్రసరణ బాగానే ఉన్నా ఆయన ఆరోగ్యం మాత్రం ఇంకా విషమంగానే ఉన్నది’ అని బుధవారం ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్న వేళ, ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ భారం ఇక భగవంతుడిదే అంటూ స్పందించారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని, కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్ని ఇవ్వాలని శర్మిష్ట సోషల్ మీడియా వేదికగా కోరారు.
ఇదిలాఉండగా, ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ దవాఖానలో ప్రణబ్ చికిత్స పొందుతున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసినట్లు డాక్టర్లు ఇప్పటికే తెలిపారు. అయినా ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. కాగా.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సోషల్ మీడియాలో ప్రణబ్ వెల్లడించిన విషయం తెలిసిందే. తనను కలిసిన వాళ్లు స్వీయ నిర్భందంలో ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇంకోవైపు కరోనా మహమ్మారి నుంచి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్ ఆకాక్షించారు. ఇప్పటికే ప్రణబ్ కుమార్తె శర్మిష్టకు ఫోన్‌చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.