
జయలలిత తరువాత అంతగొప్పగా పాలన చేయాలని స్టాలిన్ మొదటి నుండి తన పంధాలో కొత్త విధానాలు అమలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవలే మరో కొత్త పధకానికి కూడా తెరలేపారు. సాధారణంగా అనేక కారణాల వలన రోడ్లపై రోజు అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో చాలామంది సరైన సమయానికి వైద్యం అందక మృత్యువాతపడుతున్నారు. కొందరిని ఆసుపత్రులకు చేర్చినప్పటికీ, బాధితుల వద్ద సరైన నగదు లేకపోవడం వలన వైద్యం జరగక చనిపోతున్నారు. ఇవన్నీ లేకుండా ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడ ప్రమాదం జరిగినప్పటికీ, వాళ్లకు మొదటి 48 గంటలు ఉచితంగా వైద్యం అందించేందుకు స్టాలిన్ ప్రభుత్వం కొత్త పధకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పధకానికి ఇన్నూయిర్ కప్పోమ్-నమైకక్కుమ్-48(ప్రాణాలను కాపాడుకుందాం) అని నామకరణం చేశారు. ఇన్నూయిర్ కప్పోమ్ పధకం కింద మొదటి 48 గంటలు బాధితులకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ప్రస్తుతం ఈ పధకం కింద రాష్ట్రంలో ఉన్న 201 ప్రభుత్వ ఆసుపత్రులు, 408 ప్రైవేట్ ఆసుపత్రులు ఎంపిక చేశారు. బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా తమిళనాడులో ప్రమాదానికి గురైతే ఈ పధకం వర్తిస్తుంది. ప్రమాదానికి గురైన వారికి తొలి గంటలలో లభించే వైద్యం చాలా కీలకం అని అందుకే ఈ తరహా వ్యవస్థను తీసుకువచ్చినట్టు సీఎం స్టాలిన్ చెంగల్ పట్టు జిల్లా మేల్ మరువత్తూర్ ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో లాంఛనంగా ఈ పధకం ప్రారంభించారు.