
చిరంజీవి సినిమా అంటే ఆ లెక్కే వేరు. కానీ ప్రస్తుతం ఆచార్య మూవీకి మాత్రం ఆ హడావిడి కనపడలేదు. చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటించారని తెలిసినా కూడా చాలామంది సినిమాని లైట్ తీసుకున్నారు. థియేటర్స్ దగ్గర సందడి పెద్దగా లేదు. ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా సినిమాకి మైనస్ అయ్యే అవకాశముందని అంటున్నారు. సరిగ్గా పరీక్షల సీజన్లో సినిమాని తీసుకొచ్చారు. కానీ ఇప్పటికే ఈ సినిమా బాగా లేటయింది. కరోనా వల్ల రెండేళ్లపాటు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మంచి టైమ్ కోసం చూడాలంటే కుదిరేలా లేదు. కేజీఎఫ్ -2 ఇంకా థియేటర్స్ లో స్ట్రాంగ్ గానే ఉన్నా.. రాబోయే సినిమాలను దృష్టిలో ఉంచుకుని వాటికంటే ముందుగా ఆచార్యను థియేటర్స్ లో వదిలారు.
ఇక రివ్యూల సంగతికి వస్తే.. సినిమా మీద అందరికీ ఒకటే కంప్లయింట్. స్లో నేరేషన్. కొరటాల శివ సినిమాల్లో హీరోలు సహజంగానే కాస్త నెమ్మదిగా ఉంటారు. ఒకసారి యాక్షన్ మూడ్ స్టార్ట్ అయితే పీక్ కి వెళ్లిపోతుంది సినిమా. కానీ ఈసారి మణిశర్మ బీజీఎం అలాంటి హోప్స్ ఇవ్వలేదనేది మరికొందరి రియాక్షన్. మొత్తమ్మీద సినిమాని చూసినవారికంటే, చూడనివారే ఎక్కువగా సోషల్ మీడియాలో తమ రియాక్షన్స్ పెడుతున్నారు. చిరంజీవి రీఎంట్రీ తర్వాత చాన్నాళ్ల గ్యాప్ వచ్చింది కాబట్టి మెగా ఫ్యాన్స్ అందరూ సినిమాని కచ్చితంగా చూస్తారు. కానీ గతంలో లాగా సినిమా థియేటర్స్ దగ్గర హడావిడి కనిపించకపోవడం మాత్రం విచిత్రం. గతంలో భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ సినిమాలకు కనిపించినంత హడావిడి మాత్రం ఈసారి ఆచార్యకు లేదు. నిదానంగా ఈ సినిమా జనాలకు ఎక్కి, మౌత్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుంటుందేమో చూడాలి.