
మరి కొద్ది రోజుల్లో ఆనందంగా బయటకు రావాల్సిన శశికళ ఇలా ఆస్పత్రిలో ఉండటాన్ని ఆమె అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. జ్వరం అని ఆస్పత్రిలో చేరిన ఆమె.. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో శశికళకు ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం అభిమానులు, కార్యకర్తల్లో నెలకొంది. జైలు నుంచి వెయ్యి వాహనాలతో శశికళకు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేందుకు అభిమానులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ లోపే ఇలా జరగడం అభిమానులను కలవర పెడుతోంది. జైలు నుంచి విడుదలయ్యాక పోయెస్ గార్డెన్‌లోనే ఉండాలని శశికళ అనుకుంటున్నారు. అయితే అక్కడ భారీ భవంతి నిర్మాణం జరుగుతోంది. ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యేలోపు టీ నగర్‌లోని మరో ఇంట్లో ఆమె ఉండేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శశికళ 27వ తేదీ లోపు కోలుకుంటారా లేక ఆమె ఆరోగ్యం మరింత క్షీణిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. శశికళ ప్రభావం ఈ ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీ పరిస్థితి పూర్తిగా బలహీనపడింది. మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి తమిళ నాట సత్తా చాటాలని చూస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. మరోపక్క ఈ సారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనంటూ డీఎంకే నేత స్టాలిన్ దీమాగా ఉన్నారు.