
కన్నియ కుమారి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక రెండు రోజులుగా అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. వెంటనే విచారణను మొదలు పెట్టిన పోలీసులు ఆమె అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఆటో డ్రైవర్‌తో ప్రేమలో ఉన్నట్టు, అతడితో కలిసి పారిపోయినట్టు తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ప్రియుడికి ఎయిడ్స్ ఉన్న విషయాన్ని కూడా విచారణలో భాగంగా పోలీసులు తెలుసుకున్నారు. ఇంట్లో వారికి చెప్పకుండా వీరిద్దరూ కోవైలో ఉన్న తమ స్నేహితుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కోవైకు చేరుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడికి ఎయిడ్స్ ఉందనే విషయం తెలుసా అంటూ ప్రియురాలిని పోలీసులు సూటిగా ప్రశ్నించారు.
తనకు అన్ని విషయాలు తెలుసని, ఎయిడ్స్ ఉందని తెలిసే వివాహం చేసుకున్నానంటూ పోలీసులకే షాకిచ్చింది. అయితే యువతికి 17 ఏళ్లు కావడం, మైనర్‌గా ఉండటంతో ఆమెను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ప్రియుడిని అరెస్ట్ చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రియురాలు తనను కూడా అరెస్ట్ చేయాలంటూ రోడ్డుపై బైఠాయించింది. పోక్సో చట్టం కింద తాము కేసును నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. యువతికి కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందేమోనని అనుమానంతో ఆమెను పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు.