ఇపుడీ విషయమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు అర్ధంకావటంలేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపధ్యంలో ఇతర పార్టీల నేతలను, తటస్తులను బీజేపీలోకి చేర్చుకోవాలని బండి సంజయ్ తదితరులకు గట్టిగా ఆదేశించారు. పార్టీలో చేరికలపైన ఎక్కువగా దృష్టిపెట్టాలని, వీలైనంతమందిని చేర్చుకోవాలని అమిత్ పదేపదే చెప్పారు. ఇక్కడ విషయం ఏమిటంటే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మినహా ఇంకెవరూ బీజేపీలో చేరలేదు.





చేరికల కమిటికి అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈటెల ఎన్ని జిల్లాలు తిరుగుతున్నా చెప్పుకోదగ్గ నేతలెవరూ బీజేపీలో చేరలేదు. టీఆర్ఎస్ లో  ఈటెలకు విస్తృతమైన సంబంధాలే ఉన్నాయి. పైగా ఈటెలకు బీసీ నేతగా పేరుకూడా ఉంది. అయినా ఇతర పార్టీల్లోని నేతలు ఎందుకని బీజేపీ వైపు చూడటంలేదు ? ఎందుకంటే వచ్చేఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేస్తుందనే నమ్మకం చాలామందిలో లేకపోవటమే అని సమాధానం వినిపిస్తోంది.





పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే నెలరోజుల తర్వాత కానీ పార్టీలోకి చేరికలుండవట. ఎందుకంటే బీఆర్ఎస్ లో టికెట్లు ఎవరికి దక్కుతాయనేది ఇపుడే తేలే వ్యవహారం కాదు. ఒకసారేమో కేసీయార్ సిట్టింగులందరికీ టికెట్లని ప్రకటించారు. ఇదే సమయంలో నియోజకవర్గాల్లో ఒకటికి పదిసార్లు సర్వేలు చేయిస్తున్నారు. దాంతో కనీసం 30 మందికి టికెట్లు దక్కేది అనుమానమే అనే ప్రచారం బీఆర్ఎస్ లోనే పెరిగిపోతోంది. కాబట్టి బీఆర్ఎస్ లో టికెట్ల విషయం తేలితే కానీ బీజేపీలో చేరికలపై క్లారిటి వచ్చేట్లులేదు.





అంటే జరుగుతున్నది చూస్తుంటే బీజేపీకి ఇతర పార్టీల్లోని నేతలే దిక్కనట్లుగా ఉంది. 119 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి బీజేపీకి అన్నీ చోట్లా గట్టి అభ్యర్ధులు లేరన్నది వాస్తవం. ఈ కారణంగానే ఇతర పార్టీల్లో గట్టి నేతలు అనుకున్న వాళ్ళని చేర్చుకోవాలని కమలనాదులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీళ్ళెంత ప్రయత్నాలు చేస్తున్నా చేరికల్లో జోరు కనబడటంలేదు. కాబట్టి చేరికల్లో జోరు కనబడాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే తప్ప వేరే దారిలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: