ముందు కార్యకర్తల నుంచి వచ్చే సమస్యలను పరిశీలిస్తే.. గత ఎన్నికలకు ముందు .. పార్టీ అధికారంలోకి రావాలని.. కష్టపడి పనిచేసిన.. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. కనీసం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే చర్యలు కూడా తీసుకోలే దు. అంతేకాదు.. వారు ఏ పని ఉందని చెప్పినా.. తర్వాత చూద్దాం.. అంటూ తప్పించుకున్నారు. సరే! ఎమ్మెల్యేలకు ఉండే సమస్యలు వారికి ఉండి వచ్చు. కానీ.. కార్యకర్తలు.. స్థానిక ఎన్నికల్లో పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల్లోనూ పనిచేశారు. తమకు ఏదైనా మేలు జరుగుతుందని ఆశించారు. కానీ, ఇప్పటి వరకు వారికి ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు గడప గడపకు కార్యక్రమం అంటే.. మళ్లీ కార్యకర్తలు వస్తారా? అనేది ఎమ్మెల్యేల్లో గుబులు రేపుతున్న పరిణామం.
ఇక, అత్యంత కీలకమైన సమస్య.. సామాన్యులు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జోరుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యాలేదు. అయితే.. ఇదొక్కటే ప్రజల మనసులను గెలుచుకునే అంశంగా కనిపించడం లేదు. వివిధ రూపాల్లో అనేక సమస్యలు .. సామాన్యుల నుంచి ఎమ్మెల్యేలకు ఎదురవుతున్నాయి. వివిధ పథకాల్లో చాలా మంది అర్హులు ఉన్నప్పటికీ..వారికి లబ్ది చేకూరడం లేదు. అంతేకాదు.. ఓటీఎస్ కీలకమైన పరిణామంగా సామాన్యులు భావిస్తున్నారు. ఎప్పుడో తమ తాతల నాడు కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ అంటూ.. డబ్బులు కట్టడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కనుక.. తమ ఇళ్లకు వస్తే.. నిలదీయనున్నారు.
దీనికి మించి అన్నట్టుగా.. చెత్తపై పన్నుల విషయాన్ని కూడా వారు నిలదీసే అవకాశం ఉంది. ఇక, ఇవన్నీ.. ఇలా ఉంటే.. ఇంటి పన్నులు.. పెంచారు. విద్యుత్ చార్జీలను పెంచారు. సో.. ఇప్పుడు ఇవన్నీ.. ప్రజల ఆగ్రహానికి కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గడపగడపకు కార్యక్రమం ప్రకటన బాగున్నా.. ప్రజల నుంచి ముఖ్యంగా సామాన్యుల నుంచి ఎదురయ్య ప్రశ్నలకు సమాధానం ఎలా చెప్పాలనేది వారికి ఇబ్బందిగా మారింది. దీంతో ఎమ్మెల్యేలకు ఈ కార్యక్రమాన్ని చేయాలని ఉన్నా.. లోలోన మాత్రం భయం భయంగానే ఉండడం గమనార్హం., మరి ఏం చేస్తారో.. ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.