
మోడీ వెళ్లారు
భిక్షా పాత్రతో వెళ్లారో లేదో కానీ
అక్కడి వారిని మాత్రం
సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు
కాశీ విశాలాక్షి క్షేత్రాన
తనదైన మాటలు కొన్ని చెప్పి
రాజకీయం కానీ రాజకీయం కానివ్వని
ధోరణిలో ప్రసంగించి ఎప్పటిలానే
ఉత్తరాది శక్తులను ఆకర్షించేందుకు
శక్తి వంచన లేకుండా కృషి చేయడమే విశేషం.........
కాశీలో కొత్త నిర్మాణాలు కొన్ని చేపట్టారు. ఇందుకు మూడు వందల కోట్లకు పైగా వెచ్చించారు అన్నది ప్రాథమిక సమాచారం. ఎంత ఖర్చయినా అది ప్రసిద్ధ క్షేత్రం అభివృద్ధిలో భాగం కనుక మనం ఏమీ అనలేం.. అలానే మోడీకి మొన్నటి ఎన్నికల్లో రాజకీయ భిక్ష ఇచ్చిన ప్రాంతం కూడా ఇదే కావడం విశేషం. అందుకనో ఎందుకనో నిన్నటి వేళ మళ్లీ మోడీ తనదైన భావోద్వేగ ప్రసంగం ఒకటి చేసి అటుపై అక్కడి సఫాయి కార్మికులతో కూర్చొని సహపంక్తి భోజనం చేసి దేశం దృష్టిని మరియు మీడియా దృష్టిని మరో సారి ఆకర్షిచండంలో తప్పేం లేకున్నా ఇవన్నీ కూడా అవసరార్థ ప్రేమల్లో భాగం అనుకోవడం మన బాధ్యత. నమ్మి నట్టేట మునిగిపోవడం అన్నది తప్పు.
గంగా నది ఎలా ఉన్నా ఆ కాలుష్యం తీరు ఎలా ఉన్నా మోడీ మాత్రం గంగకున్నంత పవిత్రత తన మాటలకూ ఉన్నదని విశ్వసించడంలో తప్పేం లేదు. అది కూడా ఆయన భావన. ఆయన భావనలను మనం మార్చకూడదు. మన ఉద్దేశాలు అనుసారం దేశం ఉండదని విశ్వమానవ సౌభ్రాతత్వం అన్నది కేవలం పుస్తకాలకే పరిమితం అయిన వేద సంబంధ మాట అని మనం అనుకోకుండా మోడీ కానీ లేదా యోగీ కానీ చెప్పే మాటలు విశ్వాసంలోకి తీసుకోరాదు.
ప్రేమంటే మోడీ.. ప్రేమంటే వింత కూడా! వింతల్లో మోడీ వింత గాధల్లో కూడా మోడీ! ఉండాలి ఉంటారు ఉండాలనుకోవడంలో తప్పేం లేదు. ఆ విధంగా మోడీ ప్రేమ గురించి సఫాయి కార్మికులపై ఆయనకున్న గౌరవం గురించి వేరేగా చెప్పడంలో అర్థం లేదు.
ఏదయినా ఈ దేశ ప్రధానికి మనుషులు వారి ఆచారాలు విధానాలు అన్నింటిపై కూడా ప్రేమ ఉండడంలో తప్పు లేదు. ఆ ప్రేమ రాజకీయ అవసరాలకూ అవకాశాలకూ వాడుకోవడం కూడా తప్పు కాదు. వెర్రిమొర్రి జనం వీటిని అర్థం చేసుకోకపోవడంలోనే తప్పు ఉంది. కనుక ఆ తప్పు జనం చేసినంత కాలం చేయాలనుకున్నంత కాలం ఇలాంటి ట్విస్టులు వస్తూ పోతూ ఉంటూనే ఉంటాయి.