ఏదో సినిమాలో డైలాగుంది. అదేమిటంటే ప్రకృతిలో ఎక్కడో ఏదో జరిగితే దాని రియాక్షన్ ఇంకెక్కడో కనబడుతుందని. ఏపీలో జరుగుతున్న విషయాలు చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. వెంటనే ఏపీకి నిధుల వరద మొదలైంది. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఏమిటి ? వెంటనే ఏపీకి నిధుల వరద మొదలవ్వటం ఏమిటి ? నిజానికి రెండింటికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధంలేదనే అనుకోవాలి.

అయితే పరోక్షంగా మాత్రం ఎక్కడో కనెక్షన్ ఉండే ఉంటుంది. అందుకనే ఎప్పటినుండో పెండింగ్ లో పడిపోయిన నిధులు ఇపుడు విడుదలవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో సుమారు రు. 23 వేల కోట్లు విడుదలవ్వటం అంటే మామూలు విషయంకాదు. ఇప్పుడు విషయం ఏమిటంటే కర్నాటకలో బీజేపీ ఓడిపోవటం ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చిందనే చెప్పాలి. ఎలాగంటే దక్షిణాదిలో కమలంపార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. అదికూడా కోల్పోయింది. రేపటి ఎన్నికల్లో నరేంద్రమోడీ మీద వ్యతిరేకత వల్ల ఎన్డీయే అధికారానికి ఆమడదూరంలో ఆగిపోతే పరిస్ధితి ఏమిటి ?

నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీల్లో ఇపుడు కేంద్రప్రభుత్వానికి నమ్మకమైన మద్దతుదారుడు జగన్ మాత్రమే. రేపటి సంఖ్యాబలంలో తేడావచ్చి జగన్ మద్దతివ్వకపోతే అంతే సంగతులు. ఇదిమాత్రమే కాకుండా తొందరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో మోడీ ఒక బిల్లు తేబోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రప్రభుత్వానిదే పెత్తనమనే బిల్లది. ఈ బిల్లుపై మొదట రాజ్యసభలో తర్వాత లోక్ సభలో ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటిలేదు. బిల్లు పాసవ్వాలంటే జగన్ మద్దతు కచ్చితంగా అవసరం.

ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోవటానికి మోడీ ఇష్టపడటంలేదు. బహుశా ఈ కారణంతో కూడా కావచ్చు ఏపీకి ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న నిధులను విడుదల చేస్తున్నది. మోడీని ఎప్పుడు కలిసినా జగన్ నిధుల గురించి ఆడుగుతునే ఉన్నారు. కారణం ఏదైనా, ఎవరి ఆలోచనలు ఎలాగున్నా ఏపీకైతే నిధులు వస్తున్నాయి అంతేచాలు. ప్రాజెక్టులు పూర్తయి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ అయి రాష్ట్రాభివృద్ధి జరిగితే అంతకన్నా కావాల్సిందేముంటుంది ? 

మరింత సమాచారం తెలుసుకోండి: