
సంస్కృతి, సాంప్రదాయాలు, పెట్టుబడిదారీవిధానం, ఆధిపత్య ధోరణి పైన ధూమ్ దాం వంటి కార్యక్రమాల్లో గొప్పగా పాటలు పాడుకుని ప్రసంగాలు చేసినప్పటికీ ఇసుమంత కూడా ఇప్పటికీ మార్పు రాలేదు. మరి ఆనాడు పాటలు పాడిన టువంటి కళాకారులు ఇవాళ ప్రభుత్వం చేతిలో ఉద్యోగులుగా మారిపోవడంతో మాట తప్పిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు లేకపోవడంతో మన తెలంగాణ ఆకాంక్షలు కలలుగానే మిగిలిపోయాయి . ఇది ఎంతో బాధాకరం.
ఆకాంక్షలను సాధించుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహించినదా..?
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఉద్యోగ కల్పన ప్రజల ఆత్మగౌరవాన్ని సాధించడంలో కృషి చేసే బదులు ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేయడం జర్గుతుంది. రాజ్యాధికారం గురించి ఆలోచించడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను ఆలోచించకపోవడం, బడా భూస్వాములు పెట్టుబడిదారుల కోసమే బడ్జెట్ లో పెద్ద మొత్తాన్ని కేటాయించి ఖర్చు చేయడం వలన రాష్ట్రం అప్పులపాలు కాగా మధ్యతరగతి సన్న చిన్న కారు రైతులు ప్రయోజనం పొందడం లేదు. పైగా కౌలు రైతులకు రైతుబంధు వంటి సౌకర్యం వర్తించని కారణంగా గత ఏడు సంవత్సరాలలో తెలంగాణలో ఏడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఒక అంచనా రైతు లోకాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది.