మాతృత్వపు మధురిమలు ఎవరికైనా ఆనందాన్నిస్తాయి. కానీ ఆ భార్య భర్త మాత్రం ఆ మధురిమలు ఆస్వాదించడానికి దాదాపు 50ఏళ్లు వేచి చూశారు. పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత ఆ ఇంట బుజ్జాయి కేరింతలు వినపడబోతున్నాయి. ఈ అరుదైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంతంలో పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత వారి జీవితంలోకి బిడ్డను ఆహ్వానిస్తున్నారు. అసలిలాంటి ఘటన ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది..?

అందరిలాగే వారు కూడా యుక్త వయసులోనే పెళ్లి చేసుకున్నారు. కానీ అందరిలాగే వారికి సంతానం కలగలేదు. ఏళ్ల తరబడి వేచి చూశారు. కానీ ఫలితం లేదు. గుళ్లూ గోపురాలూ తిరిగారు, అయినా పిల్లలు పుట్టలేదు. చివరకు వారు విసిగి వేసారి.. పిల్లలపై ఆశలు వదిలేసుకున్నారు. ఇక తమకు పిల్లలు పుట్టరని డిసైడ్ అయ్యారు. కానీ ఇటీవలే వారి ఆశలు చిగురించాయి. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. చివరకు ఆ ప్రయోగం సక్సెస్ అయింది, వారికి పిల్లలు పుట్టారు.

పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత వారి కోరిక నెరవేరినందుకు భార్య, భర్త ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వైద్యుల విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. 75 ఏళ్ల భర్తకు, 70 ఏళ్ల భార్యకు రాజస్థాన్ వైద్యులు ఐవీఎఫ్‌ విధానం ద్వారా సంతానాన్ని కలిగించారు. అప్పటికే సైన్యంలో పనిచేసి రిటైర్మెంట్ పై వచ్చిన సైనికుడు గోపీచంద్ కి, చంద్రావతికి 1968లో వివాహం అయింది. వారికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఇటీవల ఓ మిత్రుడి ద్వారా ఐవీఎఫ్ నిపుణుడైన డాక్టర్ పంకజ్ గుప్తను ఆ దంపతులు కలిశారు. తొలి రెండుసార్లు ఐవీఎఫ్ ద్వారా ఆమెకు గర్భధారణ చేయాలని చూసినా ఆ ప్రయత్నం విఫలమైంది. చివరకు అది ఇప్పుడు విజయవంతమైంది. మూడో ప్రయత్నంలో వారికి సంతానం కలిగింది. పండంటి మగబిడ్డను చూసుకుని ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంద్రావతి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆ కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. 70ఏళ్ల వయసు దాటిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా తల్లిదండ్రులు కావడం భారత్ లో ఇదే తొలిసారి అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ivf