
ఈ సినిమా చూశాక విడిపోయిన అన్నదమ్ములు కలిసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఊరు ఊరు మొత్తం సినిమా చూసి కంటతడి పెట్టుకున్న ఘటనలు అందరూ చూసే ఉంటారు. పెద్దవారు చనిపోయాక పిట్టకు పెట్టె ఆనవాయితీ ప్రతి తెలుగు కుటుంబంలో కూడా ఉంటుంది. బలగం సినిమాలో ఈ చిన్న కాన్సెప్ట్‌ను తీసుకొని ఇక కనుమరుగైన బంధాలను గుర్తు చేశాడు డైరెక్టర్ వేణు. ఇక ఈ సినిమా ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంది అని చెప్పాలి. ఇలా వ్యక్తి మరణించిన తర్వాత తనకు ఇష్టమైన అన్ని ఆహార పదార్థాలను వండి కాకికి పెడతారు అన్న విషయం తెలిసిందే. అయితే కరీంనగర్ జిల్లాలో బలగం సినిమాను తలపించే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
జమ్మికుంటలో పూదరి వెంకటరాజ్ గౌడ్ అనే 80 ఏళ్ల వృద్ధుడు ఐదు రోజుల క్రితం మరణించాడు. అతనికి ముగ్గురు కొడుకులు. అయితే సదరు వ్యక్తి 50 ఏళ్లుగా చుట్టూ ఉన్న ఏడు గ్రామాలకు గ్రామ పెద్దగా ఉన్నాడు. చనిపోయి ఐదు రోజులు కావడంతో పిట్టకు పెట్టె కార్యక్రమం నిర్వహించారు. బలగం సినిమాలో లాగానే ఇక్కడ కాకి రాలేదు. దీంతో ఇక బలగం సినిమాలలో లాగానే వెంకటరాజు గౌడ్ కి నచ్చింది పెడితేనే కాకి ముడుతుందని వాళ్లకి అర్థమైంది. దీంతో ఆయనకు ఇష్టమైన పేక ముక్కలను తీసుకొచ్చి పల్లెల్లో పెట్టారు. ఇలా చేయడం వల్ల తన తండ్రి ఆత్మ శాంతిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఎన్ని చేసిన కాకి మాత్రం ముట్టకపోవడం గమనార్హం.