
విషయంలోకి వెళ్తే... ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచాలని భావిస్తోంది. ఇంకా పెంచలేదు. కేవలం ఏపీ ఈఆర్సీ 2022-23 సంవత్సరానికి సంబంధించిన నివేదికను మాత్రం ఇచ్చింది. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో పెంచిన చార్జీలను కొనసాగించాలా? వద్దా... అనేది సర్కారు చేతిలో ఉంది. ఒకవేళ పెంచినా.. వచ్చే ఆగస్టు నుంచి మాత్రమే ఇవి అమల్లోకి వస్తాయి. నిజానికి ఇప్పుడు పెంచిన చార్జీలను తగ్గించాలని.. సొంత పార్టీలోనే నేతల నుంచి వినతులు వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై కొత్తగా ఏర్పాటు కానున్న కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని.. జగన్ నిర్ణయించుకున్నారు..
అయితే... విపక్షాలు మాత్రం రాద్ధాంతం ప్రారంభించాయి. సరే.. వాటి పనిఅదే కాబట్టి ఎవరూ ఏమీ అనలేరు. కానీ, రెండు పార్టీలు.. బీజేపీ, జనసేన లు మాత్రం ఇప్పటివరకు.. జగన్ సర్కారును ఏయే విషయాల్లో విమర్శించినా... విద్యుత్ చార్జీల విషయంలో మాత్రం విమర్శించే అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. కేవలం ప్రకటనల వరకు మాత్రమే అవి పరిమితమయ్యాయి. ఎందుకంటే.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచాయని ఆందోళన చేస్తే.. వెంటనే వీటికి యాంటీగా.. వైసీపీ కూడా క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించుకుంది.
అదెలాగంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరను ఏకపక్షంగా 50 రూపాయలు పెంచింది. ఇది పేదలు, మధ్యతరగతివర్గంపై పెను భారంగా మారింది. పైగా సబ్జిడీని పూర్తిగా ఎత్తేసింది. దీంతో ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. అంతేకాదు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ చార్జీ లవిషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నారు. ఎలాగంటే.. కేంద్రంలో ఉన్నది బీజేపీ. సో.. రాష్ట్ర బీజేపీ నేతలు.. విద్యుత్ చార్జీలను తగ్గించాలని అంటే.. ముందు కేంద్రంలో పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేయాలి.
అలా చేయలేరు. ఇక, జనసేన కూడా బీజేపీకిపొత్తులోనే ఉంది. ఇది అలాడిమాండ్ చేసినా.. ముందు కేంద్రాన్ని అడగాలని.. వైసీపీ నేతలు నిలదీస్తారు. దీంతో ఈ రెండు పార్టీలూ.. ఇరుకున పడతాయి. మొత్తంగా.. ఏపీ విషయంలో ఈ రెండు పార్టీలు కూడా.. స్పందించకపోవడానికి ఇదే కారణమని అంటున్నారు.