గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్టుకి ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని, మా భూములను రక్షించుకునేందుకు ప్రాణాలైనా ఫణంగా పెడతామని భోగాపురం రైతులు హెచ్చరించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు నిరశనగా సోమవారం భోగాపురం రైతులు కదం తొక్కారు. వేలాది మంది రైతులు భారీ ర్యాలీ గా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. అఖిలపక్ష పార్టీ ల నేతృత్వంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ భారీ ధర్నాలో రైతన్నలు మండుటెండను సైతం లెక్క చేయకుండా నిరశనను వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రభుత్వంపై తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. తమ భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోమని, అవసరమైతే తమ ప్రాణాలైనా అర్పించి భూములను రక్షించుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నేతలు పలువురు ప్రసంగించారు. ఎయిర్ ఫోర్ట్ ఏర్పాటుకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 15 వేలా ఎకరాలు భూములు ఎందుకని ప్రశ్నించారు. స్థానిక రైతులను ఒప్పించి, మెప్పించి రెండు వేల ఎకరాల వరకు సేకరించి విమానాశ్రయం ఏర్పా టు చేయవచ్చని సూచించారు. ఇన్ని వేల ఎకరాల భూములను సేకరించి ఎంతమంది రైతులు పొట్టగొడతారని నిలదీశారు. రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం రైతన్నపై కనె్నర్రజేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని దుమ్మెత్తిపోశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధానమంత్రి మోదీలు ప్రజాసంక్షేమాన్ని పక్కనబెట్టి కార్పొరేట్ శక్తులకు భూములను ధారాదత్తం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేవలం వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాల్సిన ఎయిర్‌పోర్ట్‌కి 15 వేల ఎకరాలను చట్ట విరుద్ధంగా సేకరించేందకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ ఎయిర్‌పోర్ట్ భూసమీకరణతో భోగాపురం మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు, 16 గ్రామ పంచాయతీల పరిధిలో వందకి పైగా గ్రామాల్లో సుమారు 50 వేల మంది ప్రజలు నిర్వాశితులుగా మారుతారని అన్నారు. హుదూద్ తుపాను నుంచి తేరుకుంటున్న మండల ప్రజలు అంతకుమించి ఎయిర్‌పోర్ట్ భూసేకరణ విషయంలో భయాందోళనలు చెందుతున్నారని తెలిపారు. భూసేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కి వ్యతిరేంగా తీర్మానించిన వినతిపత్రాన్ని జిల్లా సంయక్తు కలెక్టర్ బి.రామారావుకి సమర్పించారు. అనంతరం రైతులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ధర్నా సందర్భంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఎఎస్పీ ఎ.వి రమణ నేతృత్వంలో పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ మళ్ళింపునకు పోలీసులు చర్యలు తీసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. ఈ ధర్నాలో బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, డిసిసి అధ్యక్షుడు పిల్లా విజయకుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, వైసిపి నాయకులు కాకర్లపూడి సూర్యనారాయణ రాజు, భోగాపురం మండల కాంగ్రెస్, తెలుగుదేశం, వైసిపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: