
దీన్ని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేయడం దేశద్రోహం కిందకు రాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 పునరుద్ధరణపై చైనా, పాకిస్తాన్ మద్దతు తీసుకుంటామని చెప్పినట్లు ఆరోపించిన పిటిషనర్ దాన్ని నిరూపించడంలో విఫలమయ్యారు. ఈ కేసు హైలెట్ అవుతోంది.
దీనికి కారణం ఇటీవల భారత్‌లో పెరిగిపోయిన దేశద్రోహం కేసులే. ప్రతీ దానికి దేశద్రోహం అంటూ కేసులు పెట్టడం వేధించడం కామన్‌గా మారింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తం చేసే అభిప్రాయాలను దేశద్రోహంగా పేర్కొంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలు, పోలీసులకు ఇది గట్టి షాక్ ఇచ్చేలా ఈ తీర్పు ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కేసులు నమోదు చేసే వారికి గుణపాఠంగా కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇలాంటి వేధింపుల బారిన పడుతున్న వారికి రక్షణ లభిస్తుందా అన్నదే ప్రశ్న.
పోలీసులే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు చెప్పిన మాటలు విని అమాయకుల్ని ప్రభుత్వాలపై పోరాడేవారిని తప్పుడు కేసులతో జైలు పాలు చేస్తున్నారు. ఏపీ సహా అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.కేంద్రం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. రైతుల ఉద్యమం పేరుతో ఎంత మందిపై దేశద్రోహం కేసు పెట్టిందో చెప్పడం కష్టమే. సుప్రీంకోర్టు మాటలతో కాకుండా చేతలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే స్వేచ్ఛ ప్రజలకు ఉందని నమ్మకం కలిగించే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే గొప్పగా చెప్పుకుంటున్న ప్రజాస్వామ్యం పాలకుల ఇనుప బూట్ల కింద నలిగిపోవాల్సిందే. ప్రజాస్వామ్యం పేరుతో నియంతృత్వం అనుభవించాల్సిందే.