బీహార్ రాష్ట్ర రాజకీయాలు  హీట్ పెంచుతున్నాయి .. ముందుకొచ్చిన అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైపోయింది. కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనలతో రంగంలోకి దిగారు. రాష్ట్రంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, తేజస్వి యాదవ్ RJD మళ్లీ అధికారంలోకి రావాలని పూనుకుంటున్న వేళ… ఒక సర్వే రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ సర్వే దళిత ఓటర్లపై ఆధారపడి ఉంది. దళితుల అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశంతో 'నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ అసోసియేషన్స్ (NACDAOR)' ఈ సర్వేను చేపట్టింది. జూన్ 10 నుంచి జూలై 4 మధ్య కాలంలో బీహార్‌లోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18,581 మంది షెడ్యూల్డ్ కులాల ఓటర్లతో నేరుగా మాట్లాడి ఈ ఫలితాలను సేకరించారు.


 'దళితులచే... దళితుల కోసమే' అనే నినాదంతో ఈ సర్వేను ప్రారంభించిన NACDAOR కీలకమైన విశ్లేషణను అందించింది. ఈసీపై నమ్మకం లేకపోవడం .. ఈ సర్వేలో అత్యంత శోచనీయ అంశం – 27.4% మంది దళిత ఓటర్లు భారత ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని చెబుతున్నారు. ఇది దేశంలోని లోతైన ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన విమర్శ గా భావించవచ్చు. అంతేకాదు, 71% మంది తమ ఓటు హక్కును కోల్పోతామన్న భయంతో ఉన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండకపోవచ్చన్న అనుమానం వారికి ఉన్నట్టు స్పష్టం అవుతోంది. నిరుద్యోగమే ప్రధాన సమస్య ..  ఈ సర్వేలో 58% మంది దళిత ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలో యువత, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రాధాన్యత ఇచ్చే విధంగా పార్టీలను ఆలోచింపజేస్తోంది. ప్రభుత్వ పథకాలు ప్రజల చేతికి చేరడం లేదని, ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని ఇది సంకేతం. రాజకీయ నాయకుల పట్ల అభిప్రాయాలు .. ఈ సర్వేలో దేశ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యధిక మద్దతు కనిపించింది – 47.5%. రాహుల్ గాంధీకి 40.3% మద్దతు ఉండగా, మిగిలిన 12% ఇతరులకు వెళ్ళాయి.


రాష్ట్ర నాయకుల్లో తేజస్వి యాదవ్, నితీష్ కుమార్ మధ్య పోటీ ఉంది. నితీష్ ప్రభుత్వ పనితీరుపై 48% మంది అసంతృప్తిగా ఉండగా, 45% మంది సమర్థించారు. కుల గణన ఘనత ఎవరికీ? ..  ఈసారి బీహార్ ఎన్నికల్లో కుల గణన కీలక అంశంగా మారనుంది. సర్వే ప్రకారం 33.15% మంది మోదీకి ఈ ఘనత దక్కుతుందని, 30.81% మంది రాహుల్ గాంధీకి, 27.57% మంది తేజస్వికి దక్కుతుందని అభిప్రాయపడ్డారు.చివ‌ర‌గా... ఈ సర్వే రాజకీయ పార్టీలకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తోంది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టని ప్రభుత్వాలు తిరస్కరణను ఎదుర్కొనే అవకాశముంది. ముఖ్యంగా దళిత ఓటర్ల నమ్మకాన్ని త‌మ‌వైఫు తిప్పుకోవ‌ట‌మే ఈసారి విజయానికి బలమైన ఆయుధంగా మారనుంది.  "ఓటర్ల అభిప్రాయమే భవిష్యత్ మార్గదర్శకం. రాజకీయ నాయకులు ఈ సంకేతాలను సీరియస్‌గా తీసుకోకపోతే - ప్రజాస్వామ్యం మూలాల నుండి దెబ్బతింటుంది."

మరింత సమాచారం తెలుసుకోండి: