
టీమిండియా ఒకవైపు కొత్త రికార్డు కోసం ఉవ్విళ్లూరుతుంటే, మరొకవైపు కివీస్ చెత్త రికార్డును తప్పించుకోవడంపై కసరత్తలు చేస్తోంది. వెరసి ఆదివారం బే ఓవల్ వేదికగా జరుగనున్న చివరి టీ20లో ఇరు జట్లు హోరీహోరీ పోరు కోసం సన్నద్ధమవుతున్నాయి. వరుసగా గెలవాల్సిన రెండు మ్యాచ్‌లను కోల్పోయి డీలా పడిపోయిన న్యూజిలాండ్ ఎలాగైనా పరువు నిలబెట్టుకోవాలని అలోచించి కనీసం ఆఖరిదైన ఐదో టీ20లో గెలవాలని భావిస్తోంది. కనీసం చివరి టీ20లో గెలిస్తే వన్డే సిరీస్‌కు కొత్త ఉత్సహంతో బరిలోకి దిగొచ్చనే ఆలోచన ఉంది.భారత్‌కు టీ20 సిరీస్‌ను అసలు న్యూజిలాండ్ గడ్డపై గెలవడం ఇదే తొలిసారి అయితే, దాన్ని క్లీన్‌స్వీప్‌గా ముగించే అవకాశం రావడం అరుదైన సందర్భమే.
భారత్ 2009లో 0–2తో, 2019లో 1–2తో టి20 సిరీస్‌లను చేజార్చుకోగా, ఇప్పుడు దానికి భిన్నంగా సిరీస్‌లో దూసుకుపోతోంది. భారత్ వరుసగా నాలుగు టీ20లను గెలిచి తమకు కివీస్ అసలు పోటీనే కాదని ఇప్పటికే చెప్పేసింది. అయితే న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ20ల సిరీస్‌ను గెలిస్తే కోహ్లి సేన కొత్త రికార్డును లిఖిస్తుంది. న్యూజిలాండ్‌లో ఐదు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లి గ్యాంగ్ నిలుస్తుంది. అదే సమయంలో కివీస్ ఒక చెత్త రికార్డును లిఖించుకుంటుంది. రేపటి మ్యాచ్‌లో కివీస్‌కు ఓటమి తప్పకపోతే మాత్రం సొంత గడ్డపై తొలిసారి వైట్‌వాష్ అయిన చెత్త గణాంకాలను మూటగట్టుకుంటుంది.
స్వదేశంలో మూడు, అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో న్యూజిలాండ్ ఇప్పటివరకూ వైట్‌వాష్ కాలేదు. తాజాగా ఇప్పుడు ఆ ప్రమాదంలో పడ్డారు బ్లాక్ క్యాప్స్. దీన్ని తప్పించుకోవాలంటే మానసికంగా జట్టు మరింత దృఢంగా మారాల్సిందే. నాల్గో టీ20లో కేన్ విలియమ్సన్ లేకపోవడం కూడా ఆ జట్టుపై ప‍్రభావం చూపింది. భుజం గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన విలియమ్సన్.. ఐదో టీ20లో బరిలో దిగే అవకాశం ఉంది.
ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు టేలర్ బ్యాటింగ్‌పై జట్టు ఆధారపడుతోంది. సీఫెర్ట్ ఆకట్టుకోవడంతో కివీస్ ఫర్వాలేదనిపిస్తోంది. చివరి టీ20కి పూర్తి స్థాయిలో బరిలో దిగడానికి ప్రణాళికలు రచిస్తోంది. కాగా, బౌలింగ్ విభాగం ఎప్పటిలాగే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. సౌతీ అనుభవం పెద్దగా అక్కరకు రాలేదు. వరుసగా రెండు సూపర్ ఓవర్లు వేసినా ఒక్కదాంట్లో కూడా టీమిండియాను కట్టడి చేయలేకపోయాడు.