
దశాబ్దంపాటు ఒంటరిగానే పోరాడానన్న పవన్ కల్యాణ్.. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తానన్నారు. కానీ.. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా? అంటూ పవన్.. పార్టీ శ్రేణులనే ప్రశ్నించారు. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు కలిగించట్లేదని.. నియంతను కలసికట్టుగా ఎదుర్కోవాల్సిందేని చెప్పడం ద్వారా పొత్తులు తప్పవని పవన్ తేల్చేశారు. అయితే.. అదే సమయంలో గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తామని చెప్పడం ద్వారా సీట్లపై గట్టిగానే పట్టు బడతామని చెప్పకనే చెప్పారు.
పొత్తు కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తామని చెప్పడం ద్వారా పవన్ కల్యాణ్.. టీడీపీకి సుతిమెత్తని హెచ్చరిక చేశారు. వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం అని నిన్న పవన్ కల్యాణ్ చెప్పారు.. ఇలా చెప్పడం ఒక విధంగా టీడీపీని హెచ్చరించడమే.. అంటే పొత్తు తప్పదు అన్నాం కదా అని మమ్మల్ని తక్కువగా చూడొద్దని చంద్రబాబుకు పవన్ కల్యాణ్ పరోక్షంగా చెప్పడమే కావచ్చు.
మీరు కొదమసింహాల్లా గర్జిస్తున్నారు.. మిమ్మల్ని గ్రామ సింహాలు పాలిస్తున్నాయని పవన్ కల్యాణ్ తన అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఫ్యాన్స్ కేవలం నినాదాలకు పరిమితం కావద్దు.. ఉద్యమాలు చేయాలని పవన్ కల్యాణ్ సూచిస్తున్నారు. వైకాపాకు 30 ఎంపీలు ఉండి ఏం ప్రయో జనమని ప్రశ్నించిన పవన్.. 10 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా తాను బలంగా పోరాడేవాడినంటూ తనపై ప్రజలు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు.