
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సునీత తాటి ఇలా ముచ్చటించారు.
''నిర్మాతగా నాకిది ఏడో సినిమా. కొరియన్ మూవీ 'మిడ్‌నైట్ రన్నర్స్'కి రీమేక్. ఒరిజినల్ వెర్షన్ ప్రకారం ఇద్దరు హీరోలతోనే తీద్దామనుకున్నాం. కానీ మేమనుకున్న హీరోలతో సాధ్యం కాలేదు. పైగా ఎగ్ హార్వెస్టింగ్‌కి సంబంధించిన కథ కావడంతో ఫిమేల్ సెంట్రిక్‌గా తీస్తే బాగుంటుందనుకున్నాం. పోలీస్ ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ ఆ క్రైమ్‌ని ఎలా ఎదుర్కొన్నారనేది కాన్సెప్ట్. ఫుడ్‌ని ఎక్కువగా ఇష్టపడే అమ్మాయిగా నివేద, ఓసీడీ ఉన్న అమ్మాయిగా రెజీనా కనిపిస్తారు. మొదట రెజీనాను తీసుకున్నాం. ఆ తర్వాత నివేద ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. ఇద్దరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. హీరోలకు ఏమాత్రం తీసిపోని రీతిలో నివేద డైలాగ్స్ ఉంటాయి. దర్శకుడి సెలెక్షన్ నాదే. 'స్వామి రారా' టైమ్ నుంచి తనతో వర్క్ చేయాలనుకుంటున్నా. ఆయన విజువలైజేషన్ స్టైలిష్‌గా ఉంటుంది. పైగా ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ. రవితేజ గారి సినిమాతో బిజీగా ఉండటం వల్ల ప్రమోషన్‌లో పాల్గొనడం లేదు. ఈ రోజు నుంచి పాల్గొంటారు.
ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఈ సినిమా చూసి హ్యాపీగా ఫీలవుతారు. దీని తర్వాత మా సంస్థ నుంచి శ్రీ సింహా కోడూరి నటించిన 'దొంగలున్నారు జాగ్రత్త' వస్తోంది. సమంత హీరోయిన్‌గా 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే ఇంగ్లిష్ మూవీ నిర్మిస్తున్నాం. వచ్చే యేడు మార్చిలో సెట్స్‌కి వెళుతుంది. ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో పాటు మూడు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ఒకటి హీరోయిన్ సెంట్రిక్ మూవీ. ఆరు కొరియన్ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలాగే నేను డైరెక్ట్ చేయడం కోసం రెండు స్టోరీస్ రెడీ చేసుకున్నా. ఒకటి ఫ్యాంటసీ మూవీ. మరొకటి రొమాంటిక్ కామెడీ మూవీ. ఫ్యూచర్‌లో ఆ రెండూ తీస్తా. మనవాళ్లు ఎక్కువగా కొరియన్ సినిమాలు ఫ్రీమేక్ చేస్తారనే అపవాదు ఉంది. నిజానికి కొరియన్స్ కూడా మన సినిమాల్ని కాపీ కొడుతుంటారు. చాలా మూవీస్‌ని ఫ్రీమేక్ చేస్తుంటారు.''