ఎల్లోమీడియా వైఖరి చూస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదరగొడుతున్నట్లే ఉంది. ఏ పారిశ్రామికవేత్త కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతవరకు  ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి రాకూడదన్నట్లుగానే ఉంది ఎల్లోమీడియా ఆలోచనలు. పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ప్రభుత్వం మార్చి 3,4 తేదీల్లో వైజాగ్ లో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచస్ధాయిలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలందరినీ ఆహ్వానించింది. అలాగే దేశంలోని పారిశ్రామిక దిగ్గజనాల దగ్గరకు మంత్రులు వ్యక్తిగతంగా వెళ్ళి ఆహ్వానించారు.

పెట్టుబడుల కోసం ఒకవైపు ప్రభుత్వం నానా అవస్తలు పడుతుంటే మరోవైపు ఎల్లోమీడియా మాత్రం అడ్డదిడ్డమైన రాతలు రాస్తోంది. దాదాపు పదిరోజుల నుండి పూర్తిగా నెగిటివ్ రాతలతో రెచ్చిపోతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవట, అధికారపార్టీ నేతల ఆధ్వర్యంలో అరాచకం రాజ్యం ఏలుతోందని రాసింది. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదట. డబ్బుల కోసం పారిశ్రామికవేత్తలను అధికారపార్టీ నేతలు పట్టి పీడిస్తున్నారట. అందుకనే పెద్ద పెద్ద కంపెనీలన్నీ వెళ్ళిపోయాయట.

ఇలా ఒకటి కాదు రెండు కాదు టార్గెట్ పెట్టుకుని ప్రతిరోజు ఎప్పుడెప్పుడో జరిగిపోయిన ఘటనలను ఇప్పటి ప్రభుత్వానికి లింకుపెట్టి మరీ రాతలు రాస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలు గుడ్డిగా పెట్టుబడులు పెట్టేస్తారా ? ఏపీలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే పెట్టుబడిదారులు రాష్ట్రంలోని వ్యవహారాలను అధ్యయనం చేయకుండానే, విషయాలు తెలుసుకోకుండానే కోట్లాది  రూపాయలు కుమ్మరించేస్తారా ?  ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ హయాంలో పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు ఏర్పాటు కాకూడదన్న కసి తప్ప ఎల్లోమీడియా రాతల్లో మరోటి కనబడటంలేదు.

ఎల్లోమీడియా వైఖరి ఎలాగుందంటే తినే కంచంలో మట్టి చల్లుతున్నట్లుంది. పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు పెట్టేస్తే, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేస్తే, పరిశ్రమల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అయిపోతే జగన్ ప్రభుత్వానికి ఎక్కడ మంచిపేరు వచ్చేస్తుందో అన్న మంట మాత్రమే ఎల్లోమీడియా రాతల్లో కనబడుతోంది. ఇవన్నీ జరిగిపోతే మళ్ళీ జగనే సీఎం అయిపోతారేమో అనే ఓర్వలేనితనమే కనబడుతోంది. ఎల్లోమీడియా రాతలను పారిశ్రామికవేత్తలు నమ్మితే నష్టపోయేది రాష్ట్రమే కానీ జగన్ కాదన్న కనీస ఇంగితం కూడా ఎల్లోమీడియాలో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: