ఆస్ట్రేలియా గెలిస్తే... ప్రపంచకప్‌లో మనం ‘ఫైనల్’ ముందే ఆడాల్సి వస్తుంది. ఒక రకంగా ఇదే మంచిది. సొంతగడ్డపై కంగారూలను చుట్టేస్తే ఆ తర్వాత అసలు ఫైనల్లో మరింత ధీమాగా దిగొచ్చనేది అంచనా. ఇక ఆశలు, అంచనాలతో పనిలేదు... కంగారూలే ‘వార్’కు వచ్చారు. సొంతగడ్డపై వాళ్లు నీటిలో మొసళ్లలాంటి వారు. బలంగా దాడి చేస్తారు. భారత్‌తో తాము ఆడబోయేది ‘ఫైనలే’ అంటూ క్లార్క్ ఇప్పటికే తేల్చేశాడు. ఇక ధోని అండ్ కో కంగారూలకు ‘కౌంటర్’ సిద్ధం చేయాలి. మిగిలిన రెండడుగుల్లో... గురువారం వేసే తొలి అడుగు తర్వాతి ప్రత్యర్థిలోనూ వణుకు పుట్టించాలి.

అడిలైడ్: ఆస్ట్రేలియా లాంటి జట్టుతో మ్యాచ్ అంటే అన్ని విభాగాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం అవకాశం దొరికినా అందిపుచ్చుకోవాలి. లేదంటే కంగారూలు చెలరేగిపోతారు. పాకిస్తాన్‌తో ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జరిగింది. తొలుత బ్యాటింగ్‌లో పేలవ షాట్లు... బౌలింగ్‌లో నిలకడ లేమి.. ఆపై ఫీల్డింగ్‌లో ఘోర వైఫల్యం... వెరసి పాక్‌కు పరాభవం. అడిలైడ్ ఓవల్ మైదానంలో శుక్రవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సెమీస్‌కు చేరింది. ఈ నెల 26న (గురువారం) జరిగే సెమీస్‌లో ఆస్ట్రేలియా... భారత్‌తో తలపడుతుంది.

అడిలైడ్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో 24 పరుగులకే ఓపెనర్లిద్దరూ అవుటయ్యారు. తర్వాత హారిస్ సోహైల్ (57 బంతుల్లో 41; 4 ఫోర్లు), మిస్బా (59 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్సర్లు)లకు మంచి ఆరంభాలు లభించినా... భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయారు. మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించాక ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. ఆ కొద్దిసేపటికే ఉమర్ అక్మల్ (25 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా వెనుదిరగడంతో పాక్ 124 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో ఆఫ్రిది (15 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్) పవర్ హిట్టింగ్‌తో భారీ షాట్లు కొట్టాడు. జాన్సన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన అతను మక్సూద్ (44 బంతుల్లో 29; 1 ఫోర్)తో కలిసి ఆరో వికెట్‌కు 34 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత ఆసీస్ బౌలర్లు రెండు వైపుల నుంచి ఒత్తిడి పెంచడంతో పాక్ లోయర్ ఆర్డర్ తడబడింది. 25 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు పడటంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. హాజల్‌వుడ్ 4, స్టార్క్, మ్యాక్స్‌వెల్ తలా రెండు వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా 33.5 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగులు చేసి నెగ్గింది. స్మిత్ (69 బంతుల్లో 65; 7 ఫోర్లు) టాప్ స్కోరర్. వాట్సన్ (66 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. ఆరంభంలో పాక్ పేసర్లు నిప్పులు చెరగడంతో వార్నర్ (23 బంతుల్లో 24; 3 ఫోర్లు), ఫించ్ (2) పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఫించ్‌ను సోహైల్ ఎల్బీగా వెనక్కిపంపాడు. దీనిపై బ్యాట్స్‌మన్ రివ్యూకు వెళ్లి విఫలమయ్యాడు. తర్వాత తన వరుస రెండు ఓవర్లలో రియాజ్... వార్నర్, క్లార్క్ (8)ను అవుట్ చేయడంతో ఆసీస్ 59 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనింగ్ స్పెల్‌లో ఆరు ఓవర్లు వేసిన రియాజ్ కేవలం 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 89 పరుగులు జోడించిన వాట్సన్... మ్యాక్స్‌వెల్‌తో కలిసి ఐదో వికెట్‌కు 42 బంతుల్లో అజేయంగా 68 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వాట్సన్, ఐదు పరుగులు చేశాక మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌లను పాక్ ఫీల్డర్లు వదిలేసి మూల్యం చెల్లించుకున్నారు. 7 ప్రపంచకప్‌లో అత్యధికసార్లు సెమీస్‌కు చేరిన జట్టు ఆస్ట్రేలియా. భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఆరుసార్లు సెమీస్‌కు చేరాయి. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (సి) క్లార్క్ (బి) హాజల్‌వుడ్ 5; సర్ఫరాజ్ (సి) వాట్సన్ (బి) స్టార్క్ 10; హారిస్ సోహైల్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 41; మిస్బా (సి) ఫించ్ (బి) మ్యాక్స్‌వెల్ 34; ఉమర్ అక్మల్ (సి) ఫించ్ (బి) మ్యాక్స్‌వెల్ 20; మక్సూద్ (సి) జాన్సన్ (బి) హాజల్‌వుడ్ 29; ఆఫ్రిది (సి) ఫించ్ (బి) హాజల్‌వుడ్ 23; రియాజ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 16; ఎహ్‌సాన్ ఆదిల్ (సి) స్టార్క్ (బి) ఫాల్క్‌నర్ 15; సోహైల్ ఖాన్ (సి) హాడిన్ (బి) హాజల్‌వుడ్ 4; రాహత్ అలీ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (49.5 ఓవర్లలో ఆలౌట్) 213. వికెట్ల పతనం: 1-20; 2-24; 3-97; 4-112; 5-124; 6-158; 7-188; 8-188; 9-195; 10-213. బౌలింగ్: స్టార్క్ 10-1-40-2; హాజల్‌వుడ్ 10-1-35-4; జాన్సన్ 10-0-42-1; మ్యాక్స్‌వెల్ 7-0-43-2; వాట్సన్ 5-0-17-0; ఫాల్క్‌నర్ 7.5-0-31-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహత్ అలీ (బి) రియాజ్ 24; ఫించ్ ఎల్బీడబ్ల్యు (బి) సోహైల్ ఖాన్ 2; స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఆదిల్ 65; క్లార్క్ (సి) మక్సూద్ (బి) రియాజ్ 8; వాట్సన్ నాటౌట్ 64; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 44; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (33.5 ఓవర్లలో 4 వికెట్లకు) 216. వికెట్ల పతనం: 1-15; 2-49; 3-59; 4-148. బౌలింగ్: సోహైల్ ఖాన్ 7.5-0-57-1; ఎహ్‌సాన్ ఆదిల్ 5-0-31-1; రాహత్ అలీ 6-0-37-0; రియాజ్ 9-0-54-2; ఆఫ్రిది 4-0-30-0; హారిస్ సోహైల్ 2-0-7-0.

మరింత సమాచారం తెలుసుకోండి: