ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత జగన్ విమర్శలకు కేంద్ర బిందువు... దుడుకు స్వభావం... దురుసు మాటలు.. అహంకారం... అవగాహన లేమి... ఎప్పుడేం చేస్తారో తెలియదు.. అవినీతి, అక్రమాలు.. సభకు కొత్తవారు... సభానియమాలు తెలియవు.... ఇలా.... అన్ని రకాలుగా జగన్ ను అప్రతిష్ట పాల్జేసేందుకు... ఆయన అనుభవ శూన్యుడని చెప్పేందుకు అధికారపక్షం ప్రయత్నం చేసిన సంగతి ఈ బడ్జెట్ సమావేశాల్లో బయటపడింది.  అయితే, సమావేశాల మొదట్లో టీడీపీతో సమానంగా మాటకు మాట విసిరి.. తన సభ్యులను నివారించకుండా వదిలేయడం వల్ల సభలో దురుసుగా ఉన్నారన్న పేరుపడ్డారు. అయితే అదే సమయంలో జగన్ ప్రతి విషయంపైనా సమగ్ర అవగాహనతో మాట్లాడారు. సమావేశాల కోసం చేసిన కసరత్తు, అధ్యయనం ఆయన మాటల్లో ప్రతిసారీ కనిపించింది.


అయితే.... వైసీపీ సభ్యులను ప్రభుత్వం సస్పెండ్ చేసిన తరువాత రాజకీయం మహా స్పీడుగా మలుపులు తిరిగింది. జగన్ వేసిన ప్రతి అడుగూ ఆయన రాజకీయంగా పరిణతి చెందుతున్నారనడానికి ఉదాహరణగా నిలిచాయి. తమ పార్టీ సభ్యుల సస్పెన్షన్ తరువాత వారికి మద్దతుగా సభను బాయ్ కాట్ చేయడం.... సభ బయట నిరసన తెలపడం వంటి చర్యలతో అందరి దృష్టినీ ఆకర్షించడమే కాకుండా సింపతీ కూడా సంపాదించారు. అదే సమయంలో విపక్షం లేకుండా సభను నడిపిన టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న అప్రతిష్ట మూటగట్టుకుంది. దీంతో టీడీపీ కూడా ఒక మెట్లు దిగొచ్చి సభకు రావాలంటూ జగన్ కు వర్తమానాలు పంపింది. సభలో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన జగన్ కూడా అందుకు అంగీకరించి సభకు వచ్చారు... మరోవైపు స్పీకరు అధికార పక్షానికి తానాతందానా అంటుండడంతో నిరసనగా అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. అయితే.. సమావేశాల చివరి నాటికి అందరూ నచ్చజెప్పడంతో దాన్ని కూడా జగన్ ఉపసంహరించుకున్నారు.


అదేసమయంలో తాము ఎందుకు అవిశ్వాసం పెట్టామో.... స్పీకరు ఎలా వ్యవహరించారో... అసలు స్పీకరుగా కోడెల ఎన్నిక కావడానికి తాము ఎలా సహకరించామో.. చంద్రబాబుకు తమకు తేడా ఏమిటో జగన్ శాసనసభ సాక్షిగా ప్రజలకు చేరవేయడంలో సఫలమయ్యారు. అవిశ్వాసం ఉపసంహరించుకోవడంతో వెనక్కు తగ్గినట్లుగా కనిపించినా అదికార పక్షం.. స్పీకరు వైఖరిని ఎండగట్టడానికి జగన్ ఆ ఉపసంహరణను ఉపయోగించుకున్నారు.


అంతేకాదు..... అసలు అవిశ్వాసంతో ఆయన ఇంకా పెద్ద ప్రయోజనం కూడా పొందారు. జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టకపోతే కనీసం 9మంది ఎ మ్మెల్యేలపై 6 నెలల నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేయడానికి అధికారపక్షం సిద్దమైంది. జగన్ అవిశ్వాసం పెట్టడంతో దెబ్బకు వెనక్కు తగ్గింది.


ఇలా జగన్ ఈ అసెంబ్లీ సమావేశాల్లో దూకుడు... తెలివితేటలు... ఙానం.. అవగాహన... వాక్పటిమ వంటి లక్షణాలతో పరిణతి సాధించడమే కాకుండా మునుపెన్నడూ లేని పట్టూవిడుపు దోరణి ప్రదర్శించడం రాజకీయ వర్గాలను ఆలోచింపజేస్తోంది. దూకుడు తత్వం వల్ల రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలబడలేరు.. ఎదగలేరు అని అంతా భావిస్తున్న తరుణంలో జగన్ అనూహ్యమైన రాజకీయ ఎత్తుగడలతో... పట్టూ విడుపుతో రాజకీయ పరిణతి చూపడం టీడీపీని కంగారు పెడుతోంది. అంతేకాదు.... ఎప్పుడేం చేస్తారో తెలియదని.. సీరియస్ నెస్ లేదని  పేరు పడిన జగన్ ఈయనేనా అన్నంతగా ఆయన రాజకీయ వైఖరి మారడం ఆశ్చర్యకరమే.


మరింత సమాచారం తెలుసుకోండి: