
ప్రపంచం అంతా పుతిన్ దాడిని ఖండిస్తుంటే.. డోనాల్డ్ ట్రంప్ మాత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ‘స్మార్ట్’ అంటూ ప్రశంసించారు. అదే సమయంలో అమెరికా నేతలపైనా డోనాల్డ్ ట్రంప్ పరుష పదజాలంతో విమర్శించాడు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, నాటో అధినేతలనుద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. పుతిన్ స్మార్ట్ అయితే.. మా వాళ్లు మాత్రం మూగోళ్లు అంటూ విమర్శలు చేశారు.
అమెరికాలోని ఓర్లాండోలో జరిగిన ఓ కార్యక్రమంలో డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ సంక్షోభంపై మాట్లాడారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్మార్టే.. అయితే అసలు సమస్య ఏమిటంటే.. మా నేతలు పూర్తిగా మూగవాళ్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. అక్కడితో ఆగలేదు మన ట్రంప్ గారు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరగకపోతే.. అసలు ఈ సమస్యే వచ్చేది కాదు.. అంటూ మరింత రాజకీయం జతకలిపారు. అంటే.. తానే అమెరికా ప్రెసిడెంట్‌గా ఉంటే.. ఈ సమస్యను సులభంగా పరిష్కరించేవాడిని అని చెప్పడం ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది.
అంతే కాదు.. మరో రెండేళ్లలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. ఉక్రెయిన్ ప్రజలను కూడా మెచ్చుకున్నారు. ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ చాలా ధైర్యవంతుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. మొత్తానికి రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ట్రంప్.. తన రాజకీయాలకు వాడుకుంటున్నారన్నమాట.