ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పడబోతోందా..? పోలవరం ముంపు ముండలాలన్నిటినీ కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారా..? ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం జిల్లా ఏర్పాటు చేస్తానంటూ స్టేట్ మెంట్లిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించిన ఆయన, స్థానికులకు కొత్త జిల్లా హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారాయన. ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు.

గోదావరి వరదలతో సతమతం అవుతున్న ప్రాంతాల్లో, విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటించారు. గతంలో పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసుకున్నారు. ఈ మండలాలు ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు చంద్రబాబు. ఏలూరు జిల్లాక వేలేరుపాడు, శివకాశీపురంలో ఆయన పర్యటించారు, బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే 2 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాధితుల కష్టాలు తీరవని చెప్పారాయన. బాధితులు కష్టాల్లో ఉంటే సీఎం జగన్ వారి పుండు మీద కారం చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ తాను పోలవరం కట్టలేనని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. ప్రాజెక్ట్ వల్ల నష్ట పోయే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదే తన ఆకాంక్ష అన్నారు.

సీఎం జగన్ పర్యటనకు వచ్చినపుడు అసలైన బాధితులెవరూ ముందుకు రాలేకపోయారని, ఆయన పర్యటనలో ముందుగా పేటీఎం బ్యాచ్ ని నిల్చోబెట్టారని చెప్పారు. ఆ పేటీఎం బ్యాచ్ జగన్ ముందు చప్పట్లు కొట్టారని అన్నారు. ఓట్ల కోసం అప్పట్లో పాదయాత్ర చేసిన జగన్.. ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు మాత్రం గాల్లో తిరిగారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం జరగలేదన్నారు. ఇప్పటికే ముంపు మండలాలన్నిటినీ కలిపి కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్. అయితే చంద్రబాబు మరో అడుగు ముందుకేసి, విలీన మండలాలన్నిటినీ కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇప్పటికే దీనిపై విమర్శలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు బాబు ఏం చేశారని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడొచ్చి కొత్త జిల్లా హామీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: