ఏ మాటకు ఆ మాట చెప్పాలి గాని రాజకీయాలు భలే ఉంటాయి... ఎవరు ఏం ఆలోచిస్తున్నారో ఎవరు ఏం చేయబోతున్నారో అందరూ ముందే చెప్పేస్తూ ఉంటారు. రాజకీయం అనేది అవసరాలకు తగ్గట్టు ఉంటుందనే మాట నీకు, నాకు తెలుసు. రాజకీయ నాయకులు కూడా తమకు ఏ విధంగా లాభం అనుకుంటే అలాగే చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు... ప్రజా సేవ కోసం వచ్చారు కాబట్టి రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీలకు మద్దతు ఇస్తారు. ప్రజా సేవకు మెరుగైన మార్గం ఎంచుకుంటారు.

 

చిరంజీవి విషయంలో జరిగింది అదే... నేనేం నీకు వెటకారంగా చెప్పట్లేదు. ప్రజారాజ్యంతో సేవ చేయాలని భావించినా అనుకోని పరిస్థితి కారణంగా పార్టీ మూసేశారు... కాంగ్రెస్ లోకి వెళ్ళడంతో రాజ్యసభ ఇచ్చారు కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు విద్యాశాఖ ద్వారా మంచి సేవ చేశారు. పర్యాటక శాఖ సహాయ మంత్రిగా చిరంజీవి కాస్తో కూస్తో పర్వాలేదనిపించారు. అది పక్కన పెడితే 7 ఏళ్ళ నుంచి చిరంజీవి మనోగతం పై నీకు నచ్చింది నువ్వు నాకు నచ్చింది నేను అనుకుంటున్నా...

 

టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అప్పట్లో టీడీపీ నుంచి ఆయనకు రాజ్యసభ అన్నారు. కానీ గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేష్ పట్టుబట్టడంతో వాళ్లకు ఇచ్చారు. ఆ తర్వాత బిజెపి నుంచి రాజ్యసభ... పవన్ అందుకే బిజెపి తో కలిసి... ఏపీలో బ్రతికిస్తున్నారని అన్నారు. అది సోదని తెలిసింది... ఆ తర్వాత నువ్వు విన్నావో లేదో గాని... రాజ్యసభ సీటు కోసం జగన్ ఇంటికి వెళ్ళారు చిరంజీవి అన్నారు. నాగార్జున, సురేష్ బాబు, సి కళ్యాణ్ తో కలిసి కలిసింది కూడా అందుకే అన్నారు. కాని రోడ్డు మీద కూర్చుని నేను గొడవ చేసి మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేశా కదా అని ఒకాయన పట్టుబట్టాడు అని జగన్ అందుకే ఆగారని అన్నారు.

 

ఇప్పుడు మళ్ళీ చిరంజీవికి రాజ్యసభ అంటున్నారు... వైసీపీ నుంచి జగన్ ఇచ్చేస్తున్నారు, కేసీఆర్ తో మాట్లాడి మా అధ్యక్షుడిగా మంచు విష్ణుని చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఇంకొకటి వినే ఉంటావ్... “ఏపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి... చిరంజీవి కాంగ్రెస్ వాదే, నిన్న ఏపిసీసి వ్యవహారాల ఇన్ చార్జి ఉమెన్ చాందీ కేవలం చిరంజివి తనకిష్టమైన సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారనీ... భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయి..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందనేసారు.

 

అసలు చిరంజీవి ఆలోచన ఏంటీ...? ఆయనకు ఏది కావాలి...? ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా...? సినిమాలు చేసుకుంటే మళ్ళీ రాజకీయం చేయమని ఒత్తిడి చేస్తున్నారా...? నీకు నాకు అర్ధం కావట్లేదు. సరే గాని... ఇప్పుడు కాంగ్రెస్ ఆలోచన ఎమై ఉంటుందనుకుంటున్నా అంటే... కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఉండే ఛాన్స్ లేదు... మీరు వైసీపీని నమ్ముకోవద్దు... మాతో కలిసి రండి... ఎన్నికల ప్రచారం చేయండి... పార్టీని గెలిపించండి... మీరు వస్తే ఇటు తెలంగాణాలో రేవంత్ కి కూడా బలంగా ఉంటది...

 

మిమ్మల్ని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ని చేస్తాం... కేంద్రంలో ఈసారి ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వంలో ఉంటాం... మీకు ఇమేజ్ ఉంది... మా నుంచి ఒక సహాయ మంత్రి పదవి ఇప్పించేలా చూస్తాం... అని చిరంజీవికి ఎవరైనా ఫోన్ చేశారా అని డౌట్ కొడుతోంది... అందుకే ఉమెన్ చాందీతో అగ్గిపుల్ల గీయించి శైలజానాథ్ తో ఆర్పించింది సోనియమ్మ అంటున్నారు... ఇలాంటి రాజకీయం  చంద్రబాబుకి కూడా అలవాటే... అసలే చంద్రబాబు విజన్ కి చిరంజీవి ఫ్యాన్... సెట్ చేస్తారా...? అంటే పోయినసారి కిరణ్ కుమార్ రెడ్డిని సెట్ చేసి తిట్టించుకున్నట్టు...?

మరింత సమాచారం తెలుసుకోండి: