
జగన్మోహన్ రెడ్డితో నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏమాత్రం పడటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరిమధ్య గ్యాప్ రావటానికి కారణం స్పష్టంగా తెలీదుకానీ 24 గంటలూ 365 రోజులూ జగన్ను ఎలా ఇబ్బందులుపెట్టాలా అన్న విషయాన్ని మాత్రమే రఘురాజు ఆలోచిస్తున్నారు. ఇక్కడే ఈయనతో పెద్ద సమస్య వచ్చిపడింది. ఎలాగంటే రఘురాజు లాగే జగన్ తో గ్యాప్ వచ్చిన ప్రజాప్రతినిధులు ఇంకా ఉన్నారు.
ఒక ఎంపీతో పాటు ఇద్దరు ఎంఎల్ఏలు కూడా జగన్ తో గ్యాప్ ఫీలవుతున్నారు. ఈ కారణంగానే పార్టీతో కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఇక్కడే వీళ్ళకి, రఘురాజుకు స్పష్టమైన తేడా కనబడుతోంది. జగన్ తో గ్యాప్ రాగానే వీళ్ళెవరు నోటికొచ్చినట్లు మాట్లాడటంలేదు. పైగా జగన్ను టార్గెట్ చేసుకుని అసలు నోరేఎత్తటంలేదు. మరి వీళ్ళకున్న బుద్ధికూడా రఘురాజుకు ఎందుకు లేదన్నదే ఆశ్చర్యం కలుగుతోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి, కోవూరు ఎంఎల్ఏ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా జగన్ తో గ్యాప్ వచ్చేసింది.
పై ముగ్గురు కూడా ప్రభుత్వ విధానాలను, యంత్రాంగంపై ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉన్నారు. అయితే వీళ్ళెవరు జగన్ను పర్సనల్ ఎటాక్ చేయటంలేదు. అందుకనే వీళ్ళంతా హ్యాపీగా నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు, అవసరమైనపుడు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎక్కడా వీళ్ళకు ఎలాంటి సమస్యలు ఎదురుకావటంలేదు.
మరి వీళ్ళెవరికీ ఎదురుకాని సమస్యలు ఒక్క రఘురాజుకు మాత్రమే ఎందుకు ఎదురవుతోంది ? ఎందుకంటే జగన్ తో గ్యాప్ రాగానే నరసాపురం ఎంపీ వెళ్ళి చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియాతో చేతులు కలిపారు. వచ్చిందే ఛాన్సనుకుని వాళ్ళు బాగా రెచ్చగొట్టడంతో మీడియాలో కవరేజికోసమని జగన్ పై నోరుపారేసుకోవటం మొదలుపెట్టారు. దాంతో ఏమి జరుగుతోందో అందరు చూస్తున్నదే. ఫలితంగా తన నియోజకవర్గం కాదు కదా చివరకు సొంతింటికి కూడా రాలేక ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నారు. సీఎంగా ఉన్నంతకాలం జగన్ను తాను ఏమీ చేయలేనన్న చిన్న లాజిక్ ను ఎంపీ మరచిపోయారు. అందుకే ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు.