వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి... ప్రస్తుతం ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్నారు నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణంరాజు. ఇంకా చెప్పాలంటే.. వైసీపీపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంటే కూడా రఘురామ ఎక్కువగా ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ వైసీపీని కడిగేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా కాస్త వెనక్కి తగ్గారు ఎంపీ ఆర్ఆర్ఆర్. సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో కాస్త దూకుడు తగ్గించారు రఘురామ. ఇక పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా సొంత పార్టీ ఎంపీలపైనే ఫిర్యాదులు చేశారు. వైసీప ఎంపీలు తనను దూషిస్తున్నారంటూ ఏకంగా ప్రధానికి సైతం లేఖలు రాశారు కూడా. తనకు ప్రాణహాని కూడా ఉందని ఇప్పటికే కేంద్ర హోమ్ శాఖకు లేఖ కూడా రాశారు రఘురామ కృష్ణంరాజు.

ఇప్పుడు తాజాగా మరోసారి వైసీపీ ప్రభుత్వానికి తన మనసులో కోరికను చెప్పేశారు. ఇప్పటికే సేవ్ అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు సంఘీభావంగా ఎన్నోసార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు తాజాగా మరోసారి వైఎస్ జగన్‌ సర్కార్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతి ఇస్తే... అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న రైతులను వైసీపీ ఎమ్మెల్యే పరామర్శించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే వైసీపీలో ఎంతో మంది నేతలు అమరావతి మాత్రమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. దాదాపు ఏడాది క్రితం తొలిసారి హైదరాబాద్ వచ్చిన రఘురాము ఏపీ సీఐడీ పోలీసులు రాజద్రోహం కింద అరెస్ట్ చేసి గుంటూరు తీసుకు వచ్చారు. ఆ సమయంలో సీఐడీ పోలీసులు తనపై దాడి చేశారని సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు ఆర్ఆర్ఆర్. ఇలాంటి సమయంలో రఘురామకు జగన్ అనుమతిచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయినా సరే తిరుపతిలో జరిగే బహిరంగ సభలో వైసీపీ ఎంపీ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: