స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ లో జోష్ తెచ్చింది. ఇక నెక్స్ట్ పదవుల పందారమే మిగిలిందని నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మండలి చైర్మన్,క్యాబినెట్ బెర్తులు ఎవరెవరికి దక్కనున్నాయనే చర్చ ఇప్పుడు షురూ అయింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి శాసన మండలి పై పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది. స్థానిక సంస్థల కోటాలో నిర్వహించిన ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.  కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బైపోల్ లో పరాజయంతో డీలా పడిన టీఆర్ఎస్ శ్రేణుల్లో   తాజా ఫలితాలు ఉత్సాహాన్ని నింపాయి.

ఈ ఎన్నికల్లో కరీంనగర్ లో ఒక స్థానం, ఆదిలాబాద్ స్థానం నుంచి స్వతంత్రులు బరిలో ఉండటం,వారికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతు ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒకటి రెండు సీట్లు ఓడిపోతే ఓడిపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. దీంతో టీఆర్ఎస్ కు కరీంనగర్లోని ఒక స్థానం, ఆదిలాబాద్ లో ఒక స్థానంపై అనుమానాలు ఉన్నాయని చర్చ మొదలైంది. ఎట్టకేలకు ఈ స్థానాల్లోనూ కారు గెలుపొందడంతో టిఆర్ఎస్ క్యాడర్ సంబరాల్లో మునిగి పోయింది. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మధుసూదనాచారి  నియమితులయ్యారు. ఇదివరకు గవర్నర్ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆయన పేరును గవర్నర్ ఆమోదించలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మధుసూధనాచారి పేరును సూచించింది. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కోటా లో ఎమ్మెల్సీగా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇదిలా ఉంటే కేసీఆర్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనా చారి కి బెర్త్ లభించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనతోపాటు ఎల్.రమణ కు సైతం క్యాబినెట్ లోకి తీసుకుంటారని అంటున్నారు. 2023 లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉన్నందున జనవరి, ఫిబ్రవరిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చంటూ వార్తలు వస్తున్నాయి.

స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మధుసూదనాచారిని శాసనమండలి చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కెసిఆర్ ఆయనకు మంత్రి పదవి హామీ ఇచ్చారనే నేపథ్యంలో మండలి సారధ్యం మధుసూధనాచారికే దక్కచ్చన్న ప్రచారం జరుగుతోంది. బండ ప్రకాష్ ను మండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఎవరెవరికి ఏమిటన్నది మాత్రం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: