నెల్లూరు జిల్లా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతోంది. గడచిన పదిరోజులుగా వార్తలకు, సంచలనాలకు కేంద్రంగా మారిన నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డికి రివర్స్ షాక్ తగిలినట్లు సమాచారం. కోటంరెడ్డిని టీడీపీలోకి చేర్చుకోవటానికి జిల్లాలోని సీనియర్ నేతలంతా తీవ్రంగా అభ్యంతరాలు చెప్పారట. దాంతో చంద్రబాబునాయుడు  కూడా సీనియర్ల మాటలు, అభ్యంతరాలకే ఎక్కువ విలువ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.





జగన్మోహన్ రెడ్డితో విభేదించిన కోటంరెడ్డి పదిరోజుల క్రితం మాట్లాడుతు తాను రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేస్తానని చేసిన ప్రకటనే ఇపుడు కొంపముంచుతోందట. కోటంరెడ్డి టీడీపీలో చేరటాన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, బీద రవిచంద్రయాదవ్, పొంగూరు నారాయణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. పార్టీలో  హవా నడిచినపుడు తమ విషయంలో కోటంరెడ్డి చేయించిన ధౌర్జన్యాలు, పెట్టించిన కేసులను వీళ్ళు చంద్రబాబుకు వివరించారట.





కోటంరెడ్డికి వ్యతిరేకంగా తాముచేసిన పోరాటాలను వివరించి చెప్పిన వీళ్ళు హఠాత్తుగా ఎంఎల్ఏ పార్టీమారి టీడీపీలోకి వస్తానంటే నేతలు, క్యాడర్ ఎలా సహకరిస్తారో ఆలోచించాలని చంద్రబాబుకు గట్టిగా చెప్పారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నేతలు, క్యాడరంతా కోటంరెడ్డంటే బాగా మంటమీదున్నట్లు చెప్పారట. కాబట్టి ఎట్టి పరిస్ధితుల్లోను కోటంరెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని సీనియర్లు చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే టీడీపీలో ఎవరూ ఇపుడు కోటంరెడ్డికి పెద్దగా స్పందించటంలేదట.





ఇదే సమయంలో కార్పొరేటర్లంతా  తన వెంటే ఉంటారని కోటంరెడ్డి అనుకుంటే మెజారిటి కార్పొరేటర్లు ఇప్పటికే పార్టీ వైపు నిలబడ్డారు. మిగిలిన మరికొందరు కూడా తొందరలోనే ఎంఎల్ఏని వదిలేసే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. అంటే ఇటు జగన్ తో గొడవలు పడి, పార్టీని గబ్బుపట్టించి అటు టీడీపీలో ఎంట్రీ విషయమూ అనుమానంగా మారిపోయింది. దీంతో ఇపుడు కోటంరెడ్డి పరిస్ధితి రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయేట్లుంది. మరి వచ్చేఎన్నికల్లో చివరకు తానే చెప్పినట్లు బీఆర్ఎస్ తరపున లేదా బీజేపీ తరపున పోటీచేస్తారేమో చూడాల్సిందే. ఏదేమైనా కోటంరెడ్డి అనవసరంగా కంపు చేసుకున్నాడనే చర్చే బాగా ఎక్కువగా జరుగుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: