ఏపీ రాజకీయాలు బాగా ఉత్కంఠను రేపుతున్నాయి. బీజేపీని వదిలేయగానే జనసేనలో చేరుతారని అనుకున్న మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ చప్పుడు చేయకుండా కూర్చున్నారు. పోనీ తెలుగుదేశంపార్టీలో చేరుతారా అని అడిగితే ఇపుడే ఏమీ చెప్పేనని సమాధానమిచ్చారు. ఈనెలాఖరులో టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్నా దాన్ని ఎవరూ కన్ఫర్మ్ చేయటంలేదు. ఈ నేపధ్యంలోనే కన్నా చూపు బీఆర్ఎస్ వైపుందని  హఠాత్తుగా ప్రచారం మొదలైంది.




బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతు కన్నాను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించటం జరుగుతున్న ప్రచారానికి మరింత ఊపునిచ్చింది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కన్నా తమ పార్టీలో చేరితేనే బాగుంటుందని రావెల చెప్పటం గమనార్హం. జనసేన, టీడీపీల్లో చేరటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కన్నా ఆలోచిస్తున్నారట. సమస్య కన్నాకే కాదు చేర్చుకున్న జనసేన, టీడీపీలకు కూడా తప్పదంటున్నారు.




ఈ కారణంగానే కన్నాను చేర్చుకునే విషయంలో జనసేన కానీ లేదా టీడీపీ కానీ పైకి ఏమీ మాట్లాడటంలేదు. తమపార్టీకి చెందిన నేతలను చేర్చుకున్న ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను బీజేపీ దుంపనాశనం చేస్తోంది. ఈ భయంతోనే కన్నాను చేర్చుకుంటే బీజేపీ తమను ఎక్కడ ఇబ్బందులు పెడుతుందో అనే భయం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లో మొదలైందట. అందుకనే కన్నాను చేర్చుకునే విషయంలో పై రెండుపార్టీలు వెనకాడుతున్నట్లున్నాయి. బీజేపీ నుండి చేర్చుకుంటే డైరెక్టుగా మోడీతో ఇబ్బందని రెండుపార్టీలు అనుకుంటున్నట్లున్నాయి.





ఇదే సమయంలో బీఆర్ఎస్ కు అలాంటి భయంలేదు. ఎలాగూ బీజేపీకి బద్ధవిరోధిగా ఉంది కాబట్టి బీజేపీలో నుండి తమపార్టీలోకి చేరికలను ఇంకా ప్రోత్సహిస్తోంది. చంద్రబాబు, పవన్ కు బీజేపీని ఎదిరించేంత ధైర్యం లేదన్న విషయం తెలిసిపోతోంది. ఈ కారణంగానే కన్నా కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశాలను కొట్టిపారేసేందుకు లేదు. ఎందుకంటే కన్నాకు రాజకీయంగా గట్టి అండ కావాలిపుడు. ఆ అండ చంద్రబాబు, పవన్ ద్వారా దొరికే అవకాశాలు తక్కువ. చూద్దాం చివరకు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: