ఎన్నికల సమయం దగ్గరపడుతోంది.. ప్రచారంలో వేగం పెంచాలి.. నియోజకవర్గం మొత్తం కవర్ చేయాలి.. దూకుడు పెంచితే ఖర్చు పెరుగుతుంది.. ఈసీ నిఘా నీడలా వెంటాడుతోంది. మరి ఏం చేయాలి..? ఈసీకి దొరక్కూడదు.. ప్రచారం జోరుగా సాగిపోవాలి. ఇందుకోసం కొత్త ప్లాన్లు వేస్తున్నారు.. రోడ్ షోల పేరుతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. చకచకా ప్రచారం చేసుకుంటూ సాగిపోతున్నారు.

రాజకీయ ప్రచారాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. నాయకుల విమర్శలు.. ప్రతివిమర్శలతో కాక మరింత పెరుగుతోంది. నాయకుల జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. దీంతో ఈసీ కూడా భారీగా నిఘా పెట్టింది.. ఎవరి ప్రచారం ఏ రీతీలో సాగుతుంది.. రోజుకు ఎన్ని సభలు ఏర్పాటు చేస్తున్నారు.. ఎన్ని రోడ్ షోలు జరుగుతున్నాయి.. ఇలా అన్ని వివరాలను ఈసీ పక్కాగా పరిశీలిస్తోంది. దీంతో అభ్యర్థులు ప్రచారం తీరు మారుస్తున్నారు. సభలు, సమావేశాలకు కాకుండా.. రోడ్ షోలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఎంపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు 70 లక్షల రూపాయలు దాటకూడదని పరిమితి ఉంది. అదే ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు 28 లక్షల రూపాయల లోపే ఉండాలి. దీంతో ఖర్చులు చూపించే విషయంలో అభ్యర్థులు కొత్త టెక్నిక్ లకు పదును పెడుతున్నారు. ప్రచార వ్యూహాలను మార్చేసుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా అధినాయకుడు ఎన్నికల ప్రచారానికి వస్తే.. సభ ఏర్పాటు చేయడానికి భారీగా ఖర్చవుతుంది. స్టేజ్.. లౌడ్ స్పీకర్లు.. టెంట్లు.. ఇతర ఏర్పాట్లకు భారీగా ఖర్చు అవుతుంది. సభకు వచ్చిన వాళ్లకు మంచినీళ్లు.. టిఫిన్లు ఏర్పాటు చేయాలి. ఇవీన్నీ కూడా ఈసీ కంటికి సులభంగా దొరికేస్తాయి. కాబట్టి లెక్క చూపించకతప్పుదు.. ఇటువంటి సభలు.. మూడు నాలుగు ఏర్పాటు చేస్తే చాలు.. 28 లక్షల లిమిట్ సులభంగా దాటిపోతుంది.

అందుకే నాయకులు వ్యూహం మార్చేశారు.. సభలకు బదులుగా ఎక్కడికక్కడ రోడ్ షోలు  ప్లాన్ చేస్తున్నారు. రోడ్ షోలో అభ్యర్థుల ఖర్చు కింద లెక్కలో పడేది కేవలం లౌడ్ స్పీకర్లు.. సౌండ్ సిస్టమ్ ఖర్చు మాత్రమే. నాయకుడు, అభ్యర్థి ఇద్దరూ వాహనం మీద నుంచే మాట్లాడేస్తారు కనుక  స్టేజ్, టెంట్లు వగేరా ఖర్చులు ఉండవు. సింపుల్ గా తేలిపోతుంది.  ఖర్చు విషయంలో అభ్యర్థి కి మేలు జరగుతుందన్న ఉద్దేశంతో నేతలు కూడా రోడ్ షోలకు ఒకే అనేస్తున్నారు. సాధారణంగా  పార్టీ అదినేతల సభలు అంటే.. భారీగా జన సమీకరణ జరగాలి.. ఇందు కోసం అభ్యర్థులు భారీగా జనసమీకరణ చేయాలి. వారికి డబ్బులివ్వమే కదు.. తరలించడానికి.. తిరిగి ఇళ్లకు చేర్చడాని అయ్యే రవాణ ఖర్చులు భరించాలి.. వారికి భోజన వసతి కల్పించాయి. ఈ ఖర్చలన్నీ ఈసీ కంటపడకుండా చేసినా.. టైం తక్కువగా ఉండటంతో వీటన్నింటిని పక్కాగా మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారుతోంది. ఒకవేళ జనసమీకరణలో ఫెయిల్ అయితే.. అధినేతల ముందు పరువు పోతుంది. దీంతో చాలామంది రోడ్ షోలకే జై కొడుతున్నారు. రోడ్ షోలకు భారీగా జనసమీకరణ ఏమీ అవసరం లేదు.. ఒక వెయ్యిమందిని తరలిస్తే సరిపోతుంది... బాగా రద్దీగా ఉండే సెంటర్ చూసుకుని.. కాసేపు రోడ్డు బ్లాక్ చేస్తే సరిపోతుంది. భారీగా జనం పోగుపడతారన్నది అభ్యర్థుల ప్లాన్.  రోడ్ షో అంటే తక్కువ ఖర్చుతో సులభంగా తేలిపోతోంది. 

ఇక ఇంటింటి ప్రచారం మరో ఎత్తు. ఇందుకోసం ప్రతి ప్రధాన పార్టీ అభ్యర్థి తన వెంట కనీసం 500 మంది కార్యకర్తలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వీరిలో సగానిపైగా పేయిడ్ కార్యకర్తలే ఉంటున్నారు. కొంత మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేలా మాట్లాడేసుంటున్నారు. వీరికి టిఫిన్లు, భోజనాలు అభ్యర్థులే ఏర్పాటు చేస్తున్నారు.  కొందరు మాత్రం ఇందుకు భిన్నంగా షిఫ్ట్ పద్దతుల్ని ఎంచుకుంటున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒక బ్యాచ్ ను రంగంలోకి దింపుతున్నారు. రెండు తర్వాత  కొత్త బ్యాచ్ రంగంలోకి దిగుతోంది. దీనివల్ల అభ్యర్థులకు భోజనం ఖర్చులు తగ్గుతున్నాయి. కేవలం టిఫిన్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం వచ్చినవాళ్లు.. ఎండలో తిరిగి మధ్యాహ్నానికి అలసిపోతున్నారు. ప్రచారం ఉత్సాహం తగ్గుతోంది. మధ్యాహ్నం కొత్త బ్యాచ్ రంగంలోకి దిగితే కొత్త హుషారుతో ప్రచారం జోష్ గా సాగుతోంది.  ఇలా రకరకాల ట్రిక్కులతో నేతలు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ప్రచారం చాలా మందికి ఉపాధి కల్పిస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: