
దేశంలో కరోనా అల్లకల్లోలం చేస్తుంది. గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 582 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కు పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,19,840 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా.. భూకంపాలు, భారీ వర్షాలే కాదు.. కొన్ని రాష్ట్రాల్లో పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు పంటపొలాలను నాశనం చేసిన విషయం తెలిసిందే. అసలే కరోనాతో నానా అవస్థలు పడుతుంటే.. ఇప్పుడు అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరదలు ఉప్పొంగుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతోంది. బ్రహ్మపుత్ర వరదల వల్ల పొంగి ప్రవహిస్తున్న నదుల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. ఏడు ప్రాంతాల్లో నధులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సిబ్బంది, స్థానిక పరిపాలన అధికారులతో కలిసి బాధిత ప్రజలను రక్షించడానికి, వారికి సహాయక సామగ్రి అందజేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. అసోంలోని మొత్తం 30 జిల్లాలపై వరదలు ప్రభావం చూపుతున్నాయి. మొత్తం 118 రెవెన్యూ సర్కిళ్లు వరదలకు ప్రభావితమయ్యాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని 4,627 గ్రామాలకు చెందిన 45,40,890 మంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు. వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 59 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అసలే కరోనాతో నానా బాధలు పడుతున్న అసోం ప్రజలు ఇప్పుడు వరద బీభత్సానికి అతలాకుతలం అవుతున్నారు. మరోవైపు ముంపు ప్రభావంతో నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 426 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.