
గ్రేటర్ హైదరాబాద్‌లోని బస్తీ వైద్యశాలల్లో అన్ని రకాల వైద్య సేవలను అందించేందుకు సిద్ధమైంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా, వైరల్ ఫ్లూ, తదితర పరీక్షలను బస్తీ దవాఖానల్లోనే నిర్వహిస్తున్నారు. నూతన నిర్ణయం ప్రకారం బస్తీ దవాఖానల్లో నమూనాలు సేకరించి తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌లో నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. అనంతరం ఫలితాలను సంబంధిత బస్తీ దవాఖానలకు చేరవేస్తారు. వచ్చిన ఫలితాల ఆధారంగా అవసరమైన చికిత్సను రోగులకు సంబంధిత వైద్యులు అక్కడే అందిస్తారు. దీంతో రోగులు సీజనల్ వ్యాధుల చికిత్స కోసం బస్తీలు దాటి బయటకు వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాక వ్యాధులు కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రబలకుండా ఎక్కడికక్కడే కట్టడి చేయవచ్చు. దీంతో కరోనా విస్తరణకు సైతం బ్రేక్ పడుతుంది.
కాగా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు ఎక్కడివారికి అక్కడే వైద్యం అందించేందుకు గ్రేటర్‌లో ప్రభుత్వం బస్తీ దవాఖానలను ప్రారంభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 194 బస్తీ దవాఖానలు రోగులకు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో 95, మేడ్చల్ జిల్లా పరిధిలో 79, రంగారెడ్డి పరిధిలో ఉన్న 20 బస్తీ దవాఖానల్లో అధికారులు సేవలను విస్తృత పరిచారు. ఈ బస్తీ దవాఖానలు నేటి కరోనా కాలంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి.