ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగియబోతోందా.. ఈ మేరకు రెండు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి.. త్వరలో యుద్ధం ముగిసినట్టు రెండు దేశాలు ప్రకటించబోతున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న శాంతిచర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.. మొదట్లో ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలించని చర్చలు.. ఇప్పుడు ఓ దారిన పడ్డాయి. చర్చలు జరుగుతున్న తీరుపై రష్యా, ఉక్రెయిన్ .. రెండు దేశాలు సంతృప్తి వ్యక్తం చేశాయి.


రష్యా పెడుతున్న డిమాండ్లు వాస్తవరూపకంగా ఉన్నాయని ఉక్రెయిన్‌ కామెంట్ చేసింది. అలాగే ఈ చర్చల్లో రాజీ కుదిరే అవకాశం ఉందని మాస్కో కూడా ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. మొదట రెండు విడతలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో ప్రస్తుతం ఉక్రెయిన్‌-రష్యా మధ్య మొన్న మొదలైన మూడోవిడత చర్చలు ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పుడు ఫలించే దశకు చేరుకుంటున్నాయి. తమ దేశ భద్రతకు ప్రపంచ దేశాల నుంచి హామీ కోరుకుంటున్నట్లు ఉక్రెయిన్‌ చెబుతోంది. రష్యా మాత్రం.. ఆస్ట్రియా, స్వీడెన్‌ తరహాలోనే ఉక్రెయిన్ కూడా  తటస్థ హోదా చేపట్టాలని ప్రతిపాదిస్తోంది.


అయితే.. రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చినా..  శాంతిచర్చల్లో మాస్కో డిమాండ్లు మరింత వాస్తవరూపకంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొనడం విశేషం. అలాగే ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మీడియాకు చెప్పడం ఆశలు రేకెత్తిస్తోంది. అలాగే అమెరికా కాంగ్రెస్‌లో లావ్రోవ్‌ వర్చువల్‌గా ప్రసంగించబోతున్నారు.


మొత్తం మీద రష్యా డిమాండ్లకు ఉక్రెయిన్ తలొగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చర్చలు ఫలించేలా ఉన్నా.. రష్యా మాత్రం తన దాడులు కొనసాగిస్తూనే ఉంది. యుద్ధం 20 రోజులు దాటినా రష్యా సేనలు మాత్రం తమ పని తమదే అన్నట్టు ముందుకు వెళ్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: