
ప్రపంచ క్రికెట్లో గడిచిన కొన్నేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐసీసీ కొత్త ఫార్మాట్లను పరిచయం చేయడం దగ్గర్నుంచీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ వరకూ పలు మార్పులు చేసింది . అయితే ఆసీస్ దిగ్గజ ఆటగాడు మార్క్‌వా క్రికెట్లో లెగ్ బైస్ నిబంధనను తొలగించాలని అంటున్నాడు. క్రికెట్లో అదొక వేస్ట్ రూల్ అని పేర్కొన్న వా..ఐసీసీకి దాన్ని మార్చాలంటూ విన్నవించాడు.
గురువారం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ -సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన మార్క్ వా బ్యాట్స్‌మెన్ తీసే లెగ్ బైస్‌పై విమర్శలు చేశాడు. మార్క్‌వా ప్రధానంగా సిడ్నీ థండర్స్ బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ పదే పదే లెగ్ బై రూపంలో పరుగులు సాధించడంతో అసంతృప్తి వ్యక్తం చేశాడు.
అదొక అనవసరపు రూల్ అంటూ అదే సమయంలో పేర్కొన్నాడు. ‘ మనకు తెలుసు.. మార్క్‌వా దీనిపై మాట్లాడుతూ ..లెగ్ బైస్ రూల్ ఎప్పుడ్నుంచో క్రికెట్లో అమలవుతుంది. ఇది అవసరమా. క్రికెట్లో ఈ రూల్ మొత్తం లేకుండా మార్చేయండి. నువ్వు బంతిని టచ్ చేయలేనప్పుడు పరుగులు ఎందుకు ఇవ్వాలి. శరీరానికి కానీ, ప్యాడ్లకు కానీ బంతి తగిలితే లెగ్ బైస్‌గా పరుగులు తీస్తున్నారు. దీనివల్ల క్రికెట్లో పారదర్శకత లోపించినట్లే కనబడుతోంది’ అని తెలిపాడు. అయితే ఆ కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాత్రం వాతో విభేదించాడు. ఇది గేమ్‌లో ఒక భాగమని పేర్కొన్నాడు. కాకపోతే దీనిపై మొండిగా ఉన్నావంటూ మార్క్ వాను చమత్కరించాడు.
దీనికి మార్క్‌వా సమాధానమిస్తూ.. తాను ఈ పద్ధతిని మారుస్తానంటూ చెప్పుకొచ్చాడు. మరోసారి దానికి మైకేల్ వాన్ స్పందిస్తూ..‘ నువ్వు క్రికెట్ లా మేకర్ ఎంసీసీలో సభ్యుడిగా ఉండాలి. నువ్వు అందులో ఉంటే కొత్త విధానాలను తీసుకొస్తావు అని ఆయన అన్నారు . అదే సమయంలో లండన్ కూడా తరచు రావొచ్చు. లార్డ్స్‌లో ఉన్న ఎంసీసీలోని ఒక చక్కటి రూమ్‌లో కూర్చొని మార్పులు చేయొచ్చు’ అని వాన్ పేర్కొనగా, దానికి సమాధానంగా మార్క్‌వా మాట్లాడుతూ..‘ ఈ రూల్‌ను మార్చాలనే ఆలోచన మా సోదరుడు స్టీవ్ వా ది కూడా. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలి. కనీసం వన్డే క్రికెట్లోనైనా తొలగించాలి’ అని తెలిపాడు.