
అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమం ప్రధాని మోడీ నేతృత్వంలో ఆగస్టు 5వ తేదీన ప్రతిష్టాత్మకంగా జరిగిన సంగతి తెలిసిందే. దీనికి దేశ విదేశాల నుంచి పలువురు తమ స్పందన తెలిపారు. ఇదే ఒరవడి క్రికెటర్ షమీ భార్య, మోడల్ హసీన్ జహాన్ "హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు "అంటూ సోషల్ మీడియాలో విషెస్ చెప్పారు. అయితే హిందువుల కార్యక్రమానికి ముస్లిం మహిళ శుభాకాంక్షలు తెలిపిందని భావించారో లేక మరే కారణమో తెలియదు కానీ...ఆమెకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. ఇదే విషయాన్ని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపినందుకు గానూ తనను కొందరు వేధిస్తున్నారని కోల్‌కతా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
కొందరు నెటిజన్లు "అత్యాచారం చేసి చంపేస్తాం " అంటూ కామెంట్లు పెడుతున్నారని హసీన్ జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని కోరారు. తాను నిస్సహాయురాలినై పోయానని, అభద్రతాభావం వెంటాడుతోందని పేర్కొన్నారు. ఇది ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయని ఫిర్యాదులో తెలిపారు.
కాగా, కోల్‌కతా పోలీసులు షమీ భార్య హసీన్ జహాన్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ దర్యాప్తు జరిపిన ఏడాది తర్వాత ఈ ఛార్జిషీట్ దాఖలు చేశారు. గతంలో షమీపై వరకట్నం వేధింపులు, లైంగిక వేధింపుల కేసుల్లో కోల్ కతా పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. షమీపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద వరకట్న వేధింపులు, సెక్షన్ 354ఏ కింద లైంగిక వేధింపుల కేసుల్లో ఈ ఛార్జిషీట్లు ఫైలయ్యాయి.