ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ స్ధానాల భర్తీలో ఏడుగురు అభ్యర్ధులు గెలిచారు. కాకపోతే ఊహించని ఫలితం ఎదురై జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది. వైసీపీ తరపున ఏడుగురు అభ్యర్ధులు గెలుస్తారని అనుకుంటే అనూహ్యంగా టీడీపీ తరపున పోటీచేసిన పంచుమర్తి అనూరాధ గెలిచారు. నిజానికి వైసీపీ తరపున పోటీచేసిన ఏడుగురు అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారనే అందరు అనుకున్నారు. ఎందుకంటే సంఖ్యాబలం రీత్యా వైసీపీ ఏడు సీట్లను గెలుచుకునే అవకాశముంది.

ఇదే సమయంలో గెలుపు అవకాశాలు లేకపోయినా చంద్రబాబునాయుడు ఒక అభ్యర్ధిని రంగంలోకి దింపారు. దాంతోనే చంద్రబాబు మళ్ళీ ఓటుకునోటు వ్యవహారానికి తెరలేపినట్లు అర్ధమైంది. అనుకున్నట్లుగానే వైసీపీ తరపునుండి నాలుగు ఓట్లు టీడీపీకి పడ్డాయి. ఇందులో ఇద్దరు రెబల్ ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ఓట్లు వైసీపీకి పడవనే అందరు అనుకున్నదే. కాకపోతే వీళ్ళకు అదనంగా మరో ఇద్దరు ఎంఎల్ఏలు కూడా టీడీపీకి క్రాస్ ఓట్లు వేశారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగిన వాళ్ళు ఎవరేది పెద్ద ప్రశ్న. 

ఇపుడా ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరు అనే విషయమై జగన్ దగ్గర పోస్టుమార్టమ్ జరుగుతోంది. ఈ పాటికే క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరిలో ఎవరనేది తెలిసిపోయుంటుంది. ఎందుకంటే జయమంగళ వెంకటరమణ,  కోలా గురువులకు కేటాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో ఒక్కొక్కళ్ళు ఓట్లు వేయలేదని అర్ధమైపోయింది. కాకపోతే ఆ ఇద్దరు ఎవరన్నది బయటజనాలకు అంతుపట్టడంలేదు.

మొత్తానికి తాను నమ్ముకున్న ఓటుకునోటు పద్దతినే చంద్రబాబు పాటించి సక్సెస్ అయ్యారు. 2014-19 మధ్య వైసీపీ తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలను, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి లాక్కున్నట్లే ఇఫుడు కూడా ప్రలోభాలకు గురిచేసి ఇద్దరు ఎంఎల్ఏల ఓట్లు లాక్కున్నారని అర్ధమైపోతోంది. రెబల్ ఎంఎల్ఏల ఓట్లతోనే టీడీపీ సరిపెట్టుకునుంటే ఇందులో అనుకోవటానికి ఏమీలేదు. ఎప్పుడైతే అదనంగా ఇద్దరు ఎంఎల్ఏలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారో ఓటుకునోటు లేదా ప్రలోభాలు బాగా పనిచేసినట్లు అర్ధమవుతోంది. మరి పోస్టుమార్టమ్ తర్వాత జగన్ ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: