
‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించాడు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914 , సెప్టెంబరు 9 న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో పట్టాడు. అయితే కాళోజి అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి. తెలుగు, ఉర్దూ , హిందీ , మరాఠీ, కన్నడ , ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు కాళోజి.
రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో దిట్ట ఆయన. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా నిలిచాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో కనిపిస్తాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది కాళోజీ కుటుంబం. ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు.
1939 లో హైదరాబాదు లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ కోరిక. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు కాళోజి. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీది పెనవేసుకున్న అనుబంధం. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానుభావుని నివాళి.