
ఈ ప్రాంతానికి కొత్తగా ప్రాంతీయ సమన్వయకర్త సుబ్బారెడ్డి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన సమక్షంలోనే ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ , బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్ వర్గీయులు రెచ్చిపోయిన ఘటన చర్చనీయాంశం అవుతోంది. వీరి వర్గీయులులు సుబ్బా రెడ్డి పరస్పర వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఈ రెండు వర్గాల మధ్య వివాదం ముదిరి చివరకు తోపులాటల వరకూ వెళ్లింది.
ఈ సమావేశానికి ముందు కూడా ఈ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. విజయ సాయి రెడ్డి పేరు అడ్డు పెట్టుకుని సీతంరాజు సుధాకర్ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నది విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ ఆరోపణ. ఈయన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ పై బాహాటంగానే తన అసంతృప్తి వెళ్ల గక్కారు. రాజ్యసభ సభ్యుల వల్ల సీఎం కాలేరని, ఎమ్మెల్యేలు గెలవాల్సి ఉంటుందంటూ చురకలు కూడా వేశారు.
ఈ విషయం ఉత్తరాంధ్ర వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేసిన విజయ సాయి రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో అంటూ వ్యాఖ్యాలు చేసే రేంజ్‌కి ఇక్కడి విబేధాలు వెళ్లిపోయాయి. విజయ సాయి వెళ్లి .. కొత్త సుబ్బారెడ్డి వచ్చిన నేపథ్యంలో ఈ సుబ్బారెడ్డి అయినా ఈ సమస్యపై దృష్టి పెట్టాలని వాసుపల్లి గణేశ్ సూచించారు. ఇలా అధికార పార్టీకి చెందిన నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి విశాఖ వైసీపీలో కనిపిస్తోంది. మరి ఈ సమస్యను సుబ్బారెడ్డి ఎంత వరకూ సామరస్యంగా పరిష్కరిస్తారో చూడాలి.