నీళ్లు, నిధులు, నియామాకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్. ఇందులో నీళ్లు, నిధుల సంగతెలా ఉన్నా.. నియామకాలు మాత్రం కొత్త రాష్ట్రంలో నిప్పులు రాజేస్తున్నాయి. కలసి నడిచిన నేతల మధ్య కలహానికి కారణమవుతున్నాయి. టీజేఏసీ... తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ.. ఒకప్పుడు ఇది టీఆర్ఎస్‌కి పెద్ద అండ. ప్రస్తుతం అదే సర్కార్ గుండెల్లో గుబులు రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర కాంక్షకు కారణమైన వాటిలో ఒకటైన నియామకాల ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.

స్వరాష్ట్ర సాధన కోసం సాగిన సమరంలో టీఆర్‌ఎస్ సారధి కేసీఆర్, టీజేఏసీ సారధి కోదండరాం నాలుగేళ్లపాటు కలిసి పనిచేశారు. కలిసే ఉద్యమ కార్యాచరణ సిద్ధంచేశారు. దానికి అనుగుణంగా పోరాటాలు జరిపి అనుకున్న ఫలితాన్ని రాబట్టగలిగారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేశారు. కానీ... ఇదంతా గతం.. దాదాపు మూడేళ్ల కిందటి ముచ్చట. ప్రస్తుతం వారిద్దరూ కత్తులు దూసుకుంటున్నారు. నిరుద్యోగ సమస్యపై ఎవరికి వారు నిప్పులు చెరుగుతున్నారు.

కేసీఆర్ సీఎం సీటులో సెటిలై మూడేళ్లు కావస్తోంది. ఈ సమయంలోనే ప్రభుత్వంపై కోదండం ఎక్కుపెడుతోంది టీజేఏసీ. ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇపుడు తన తడాఖా చూపించడానికి రెడీ అవుతోంది. నిరుద్యోగ సమస్యను అస్త్రంగా చేసుకుని సర్కార్‌పై సమరశంఖం పూరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేసిన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం... నిరుద్యోగ ర్యాలీ కోసం విద్యార్థులను సిద్ధం చేశారు. హైదరాబాద్ వేదికగా ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది.

అధికార పగ్గాలు అందుకోక ముందు నిరుద్యోగ సమస్యను, నియామకాల్లో అన్యాయాన్ని ఎత్తిచూపిన కేసీఆర్.. ఇపుడు ఆ మాటెత్తితే చాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆనాడు ఉద్యమం ఉవ్వెతున ఎగిసిపడేందుకు కారణమైన విద్యార్థులను నేడు కనికరించడంలేదు. ఉద్యమ సమయంలో జరిపిన మిలియన్ మార్చ్‌కు మద్దతు ఇచ్చిన ఆయనే... ఇపుడు సర్కార్‌పై అదే తరహా పోరాటం సలుపుదామనుకుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు.

దీంతో కేసీఆర్ పాలనపై అంతెత్తున ఎగిరిపడుతున్నారు టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం. అధికారం చేపట్టకముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఎన్నికల సమయంలో లక్ష ఉద్యోగాలంటూ ఊదరగొట్టిన కేసీఆర్... అధికారం చేపట్టాక ఆ మాటే మర్చిపోయారని మండిపడుతున్నారు. నిరుద్యోగులతో కలిసి పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం.. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని, అధికారం చేపట్టి మూడేళ్లయినా నిండకముందే 28వేల 627 పోస్టులను భర్తీ చేశామని, మరో 75వేల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. ఆ దిశగా ఇప్పటికే మరో 24వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని... రాబోయే రెండేళ్లలో 46వేల పోస్టులు ఫిలప్ చేస్తామని అంటోంది. ఇంతేకాదు.. పలుశాఖల్లోని 27వేల 826 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు ఇప్పటికే ఉత్తర్వులిచ్చామని చెబుతోంది. అటు... విద్యుత్ శాఖలోని మరో 23వేల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించామని అంటోంది. మొత్తంగా తమ పాలనా సమయం ముగిసేలోపు చెప్పినట్లుగానే లక్ష ఉద్యోగాలను కచ్చితంగా ఇచ్చి తీరుతామంటోంది.

అయితే.. ప్రభుత్వ ప్రకటనతో టీజేఏసీ విభేదిస్తోంది. ప్రభుత్వం భర్తీ చేశామని చెబుతున్న 28వేలకు పైగా పోస్టుల్లో కేవలం 5వేల 936 మాత్రమే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేశారని... అవి మాత్రమే లెక్కలోకి వస్తాయని చెబుతోంది. సింగరేణిలో 5వేల 105, విద్యుత్ శాఖలో 2వేల 345, ఆర్టీసీలో 3వేల 986 ఉద్యోగాలు కల్పించినా అవేవీ ప్రభుత్వ పరంగా చేసినవి కావంటున్నారు. ఇక పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11వేల 281 పోస్టులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు మాత్రమే ప్రకటించారని... ఇంకా ఎవరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదని అంటోంది. పైగా ఈ ఫలితాల విషయంలోనూ అవకతవకలు జరిగాయంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇక భవిష్యత్‌లో ఫిలప్ చేస్తామంటున్న 46వేల పోస్టులను కూడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి చేతులు దులుపుకోవాలని అనుకుంటోందని విమర్శిస్తోంది. ఇలా ... ఇటు టీజేఏసీ, అటు టీఆర్‌ఎస్ ఎవరికివారే తమ వాదనను నెగ్గించుకునే క్రమంలో డైలాగ్ వార్‌కు తెరలేపారు..